Telangana: బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై వాట్ నెక్ట్స్.. రెండు బిల్లులకు మద్దతు తెలిపిన విపక్షాలు
ఆ బిల్లులకు అసెంబ్లీ ఓకే చెప్పింది. సభలోని పార్టీలన్నీ వాటికి జై కొట్టాయి. మరి.. శాసనసభ ఆమోదించిన ఆ బిల్లుల అమలుకు లైన్ క్లియర్ అయినట్టేనా ?.. ఆ రెండు బిల్లుల విషయంలో ఇప్పుడు ఏం జరగనుంది ? ఆ వివరాలు

తెలంగాణ అసెంబ్లీ కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించింది. విపక్షాలు పలు సూచనలు చేసినప్పటికీ.. పార్టీలన్నీ ఈ రెండు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తాము కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే అని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాల్సిందేనని తెలిపాయి. ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వీటి అమలు పరిస్థితి ఏంటనే అంశంపై చర్చ మొదలైంది. ఈ రెండు బిల్లుల్లో ఒకటైన ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకునే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్. బిల్లుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా లైన్ క్లియర్ అయ్యింది.
అయితే బీసీ బిల్లు అమలు అంశం మాత్రం కేంద్రం ఆమోదిస్తేనే జరిగే అవకాశం ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులనూ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఈ బిల్లును పార్లమెంట్‌కు పంపి ఆమోదింపజేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఇందుకోసం అఖిలపక్ష నేతలను తీసుకుని ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించారు సీఎం రేవంత్. ఇందుకోసం సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో పెట్టడంపై సీఎం రేవంత్ నాయకత్వంలో ఢిల్లీ వెళతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్న నాయకుల సహకారం కూడా తీసుకుంటామని వెల్లడించింది. ఒకవేళ ఇందుకు కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. స్థానిక సంస్థల్లో, విద్య ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉండటంతో ఈ అంశంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది.