
సీఎం కేసీఆర్ తెలంగాణ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేసీఆర్.. తొలుత మహారాష్ట్రను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత పావులు కదువుతున్నారు. సోమవారం ఔరంగాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెండు సార్లు బహిరంగ సభలు జరిగాయి. ఈ సభలకు భారీ స్పందన లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరోసభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ నెల 24న సోమవారం ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి.
రోజురోజుకూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్థానికంగా పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే సీఎంను మహారాష్ట్ర నేతలు నిత్యం కలుస్తున్నారు. తాజాగా ఔరంగాబాద్ నుంచి కీలక నేతలు సీఎం కేసీఆర్ ను కలిసినట్లు తెలిసింది. తమ ప్రాంతంలో సభ నిర్వహించాలని వారు కోరడంతో.. కేసీఆర్ బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. తెలంగాణ నుంచివెళ్లిన కొంతమంది అక్కడే తిష్టవేసి సభ ఏర్పాట్లు చక్కబెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..