Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Maha Dharna Highlights: ముగిసిన టీఆర్‌ఎస్‌ మహా ధర్నా.. గవర్నర్‌తో ముగిసిన భేటీ

Narender Vaitla

| Edited By: Subhash Goud

Updated on: Nov 18, 2021 | 5:27 PM

CM KCR Maha Dharna Highlights: కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా ముగిసింది. అనంతరం గవర్నర్ కు వినతి పత్రం..

CM KCR Maha Dharna Highlights: ముగిసిన టీఆర్‌ఎస్‌ మహా ధర్నా.. గవర్నర్‌తో ముగిసిన భేటీ
Kcr Dharna

CM KCR Maha Dharna Highlights: కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా ముగిసింది. అనంతరం గవర్నర్ కు వినతి పత్రం సమర్పించి భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు విషయమై గవర్నర్ తో చర్చించి కొద్ది సేపటి క్రితమే భేటీ ముగించారు.  తెలంగాణ రైతుల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని ప్రకటించారు కేసీఆర్. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరుగుతున్న దీక్షలో వరి కంకులతోపాటు నాగలిని పట్టుకున్నారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

వ్యవ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్న సీఎం.. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగం, వ్యవ‌సాయం ప‌ట్ల కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌న్న సీఎం.. రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌న్నారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్రయోజ‌నాలు ప‌రిర‌క్షించేంత వ‌ర‌కు, ఉత్తర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్యత్‌లో ఉధృతం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇక ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా ముగియగానే పార్టీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌ వెళ్లి ముఖ్యమంత్రి గవర్నర్‌కు వినతి పత్రం అందించనున్నారు.

టీఆర్ఎస్ మహా ధర్నాకు సంబంధించిన విశేషాలు ఎప్పుటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Nov 2021 03:13 PM (IST)

    యాసంగిలో కేంద్రం వడ్లు కొనేలా చూడాలి

    ధర్నా తర్వాత టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో కేంద్రం వడ్లు కొనేలా చూడాలని విన్నించారు. కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, యాసంగిలో ఎంత కొంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

  • 18 Nov 2021 03:06 PM (IST)

    గవర్నర్‌తో ముగిసిన మంత్రుల భేటీ

    కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా చేసిన విషయం తెలిసింది. అనంతరం గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించి భేటీ అయ్యారు. వరిధాన్యం కొనుగోలుపై గవర్నర్‌తో చర్చించారు. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది.

  • 18 Nov 2021 02:42 PM (IST)

    గవర్నర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ

    కేంద్రం తీరును నిరసిస్తూ చేపట్టిన మహాధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ వినతి పత్రం సమర్పించి భేటీ అయ్యారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేలా చూడాలని మంత్రులు విన్నవించారు.

  • 18 Nov 2021 02:38 PM (IST)

    గవర్నర్‌కు వినతి పత్రం

    కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మహా ధర్నా ముగిసింది. 11 గంటలకు మొదలైన ధర్నా 2 గంటలకు కేసీఆర్‌ ప్రసంగంతో ముగిసింది. అనంతరం మంత్రులతో కలిసి రాజ్‌ భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ గవర్నర్‌ తమిళసైని కలిసి వినతిపత్రాన్ని అందించారు.

  • 18 Nov 2021 02:05 PM (IST)

    ముగిసిన టీఆర్‌ఎస్‌ మహా ధర్న..

    కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మహా ధర్నా ముగిసింది. 11 గంటలకు మొదలైన ధర్నా 2 గంటలకు కేసీఆర్‌ స్పీచ్‌తో ముగిసింది. ఇక ధర్నా ముగిసన వెంటనే మంత్రులతో కలిసి సీఎం రాజ్‌ భవన్‌ను బయలుదేరారు. గవర్నర్‌ తమిళసైని కలిసి వినతిపత్రాన్ని అందించనున్నారు. కాసేపటి క్రితమే సీఎం కాన్వాన్‌ ఇందిరా పార్క్‌ నుంచి ప్రారంభమైంది.

  • 18 Nov 2021 01:55 PM (IST)

    పదవులు మాకు చిత్తు కాగితాలు..

    కేంద్రం రైతు వ్యతిరేక పాలన చేస్తోందని విమర్శించిన కేసీఆర్‌.. ‘అవసరమైతే దేశ రైతుల సమస్యపై లీడర్‌ షిప్‌ తీసుకొని టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది. మాకు పదవులు చిత్తు కాగితాలతో సమానం. ధాన్యం సేకరించే బాధ్యత కేంద్రానిదే. ధాన్యం కొనుగోలు చేయకపోతే బియ్యాన్ని తీసుకొచ్చి బీజేపీ ఆఫీసుల ముందు కుమ్మరిస్తాం. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజలకు మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌, సరిహద్దుల్లో నాటకాలు తెలిసిపోయాయి. వడ్ల కోసం మా పోరాటం మొదలైంది.. ఇక దేశం కోసం కూడా పోరాడుతాం’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

  • 18 Nov 2021 01:40 PM (IST)

    ధర్నాలో మాట్లాడుతోన్న కేసీఆర్‌..

    కేంద్రం వైఖరికి నిరసనగా జరుగుతోన్న మహా ధర్నాలో కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రానికి నేను ఒకే సూటి ప్రశ్న అడుగుతున్నా..? వడ్లు కొంటరా.? కొనరా.? కొత్త సాగు చట్టాల వల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఇబ్బంది కలిగించేవే. ఈ గోస ఒక్క తెలంగాణలోనే కాదు దేశమంతా ఉంది. ఏడాదిగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలు నిరంకుశ చట్టాలు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కంటే ఆహార కొరతలో మనమే ముందున్నాం. దేశాన్ని పాలించడంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని పార్టీలు విఫలమయ్యాయి. మేము పండించిన ధాన్యాన్ని మీరు సేకరిస్తారా.? లేదా.? అన్న దానికి సమాధానం చెప్పట్లేదు. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని కేసీఆర్‌ కేంద్రాన్ని విమర్శించారు.

  • 18 Nov 2021 01:20 PM (IST)

    పాదయాత్రకు సంబంధించి మా దగ్గర సమాచారం లేదు..

    కేసీఆర్‌ పాదయాత్రకు వెళ్లనున్నారని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రోడ్డు మార్గాన వెళ్లడం అంతసులభమైన విషయం కాదని పోలీసులు చెబుతున్నారు. ధర్నా ముగియగానే కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులంతా వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారని పోలీసులు చెబుతున్నారు.

  • 18 Nov 2021 01:15 PM (IST)

    కేసీఆర్‌ పాదయాత్రపై డైలమా.. పోలీసులు క్లియరెన్స్‌ ఇస్తారా..

    ఇందిరాపార్క్‌ నుంచి రాజ్‌ భవన్‌ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాద యాత్రగా వెళ్లనున్నారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇంకా స్పష్టత రాలేదు. ఉన్న ఫలంగా ముఖ్యమంత్రి పాద యాత్ర చేస్తారనడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి క్లియరెన్స్‌ వస్తేనే.. పాద యాత్ర ఉండనున్నట్లు సమాచారం.

  • 18 Nov 2021 01:08 PM (IST)

    ఇందిరాపార్క్‌ నుంచి రాజ్‌ భవన్‌కు పాదయాత్రగా సీఎం..

    ఇందిరా పార్క్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ధర్నా పూర్తికాగానే మంత్రులు, పార్టీ నాయకులతో కలిసి గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినతి పత్రాన్ని అందించనున్నారు. సీఎం పాద యాత్రగా సచివాలయం మీదుగా, రాజ్‌ భవన్‌ను చేరుకోనున్నారు. ఇక కేంద్రం స్పందించకపోతే ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు.

  • 18 Nov 2021 12:31 PM (IST)

    ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా సండ్ర..

    ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శరీరంపై వ‌డ్ల కంకుల‌ను అంకరించుకొని.. భుజంపై నాగ‌లి పెట్టుకుని ఆయన నిర‌స‌న వ్యక్తం చేశారు.

    Sandra

  • 18 Nov 2021 11:56 AM (IST)

    టాప్‌ గేరులో కారు: అసదుద్దీన్‌ ఆసక్తికర ట్వీట్‌.

    కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా సీఎం అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తోన్న ధర్నాపై తనదైన శైలిలో స్పందించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. మహాధర్నాకు సంబంధించిన న్యూస్‌ ఆర్టికల్‌ను షేర్‌ చేస్తూ.. ‘కారు టాప్‌ గేరులో ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

  • 18 Nov 2021 11:30 AM (IST)

    ఈ పోరాటం ఆగదు: సీఎం కేసీఆర్‌.

    కేంద్రం దిగొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తమ పోరు ఆగదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో సీఎం ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ పోరాటం ఉధృతమైన ఉప్పెనలా సాగుతుంది. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ యుద్ధం జరుగుతోంది. కేంద్రం దగొచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది.. ఇది అంతం కాదు, ఆరంభం. లేక రాసినా కేంద్రానికి ఉలుకూ పలుకు లేదు. కేంద్రం దిగొచ్చే వరకు గ్రామ గ్రామాన పోరాటం చేద్దాం’ అని చెప్పుకొచ్చారు.

  • 18 Nov 2021 11:16 AM (IST)

    సభా స్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్‌..

    కేంద్రంపై నిరసనగా చేపట్టిన ధర్నా స్థలికి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం కేసీఆర్‌ ధర్నాలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. సుమారు రెండు గంటల పాటు ధర్నాలో పాల్గొననున్న కేసీఆర్‌.. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించనున్నారు. దీంతో కేసీఆర్‌ ఏం మాట్లాడుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

  • 18 Nov 2021 11:08 AM (IST)

    ఇందిరా పార్క్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్‌..

    కేంద్రం తీరుకు వ్యతిరేంగా టీఆర్‌ఎస్‌ చేపడుతోన్న మహాధర్నా కార్యక్రమం పాల్గొనడానికి సీఎం ముఖ్యం మంత్రి ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి సభా స్థలికి చేరుకోనున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నాలో పాల్గొంటుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • 18 Nov 2021 10:54 AM (IST)

    సభా స్థలికి చేరుకున్న కేటీఆర్‌..

    కేంద్రంపై పోరుకు టీఆర్‌ఎస్‌ చేస్తోన్న మహా ధర్న కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఇతర నాయకులతో కలిసి ప్లకార్డులో ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ‘వడ్లు కొనాలని పోరాటం.. రైతు బతుకుల ఆరాటం’ అని రాసున్న ప్లకార్డును మంత్రి ప్రదర్శిస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.

  • 18 Nov 2021 10:43 AM (IST)

    సీఎం అయ్యాక తొలిసారి..

    తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్‌ తొలిసారి ధర్నాలో పాల్గొంటున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఇప్పటికే అల్టిమేటమ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా స్వయంగా ధర్నాలో కూర్చుంటున్నారు. ఇందిరాపార్క్‌లో కాసేపట్లో మొదలయ్యే ధర్నాలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో ఇందిరా పార్క్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

  • 18 Nov 2021 10:10 AM (IST)

    12 గంటల తర్వాత ధర్నా చౌక్‌కి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌..

    మహా ధర్నా జరుగుతోన్న సభా స్థలికి సీఎం కేసీఆర్‌ 12 గంటల తర్వాత చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సభ ముగిసిన తర్వాత సీఎం గవర్నర్‌ను కలవనున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. మంత్రులే రాజ్‌ భవన్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

  • 18 Nov 2021 10:05 AM (IST)

    సభా స్థలికి చేరుకున్న మంత్రి హరీష్‌.. ఏర్పాట్లన్నీ దగ్గరుండి..

    కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మహా ధర్న మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభాస్థలికి ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు చేరుకున్నారు. మంత్రి హరీష్‌ రావు సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా వేదిక వద్దకు చేరుకున్నారు.

Published On - Nov 18,2021 9:56 AM

Follow us