
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మిత్రులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకొని, క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని కేసీఆర్ కోరుకున్నారు.
ఇక గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత గడిచిన 9 ఏళ్లలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతోన్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
* షాదీ ముబారక్ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 2,130.90 కోట్లు కేటాయించింది.
* రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు వాటిని రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు.
* ఈ విద్యా సంస్థల్లో మొత్తం 7570 పోస్టులను భర్తీ చేశారు. వీటిలో 6579 రెగ్యులర్ కాగా, 991 ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు.
* ఏడేళ్ల కాలంలో ఈ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన సుమారు 5099 విద్యార్థులు ఐఐటీ, నీట్, ఎమ్‌ఎస్‌ఈటీ, ఐఐటీ, పాలీసెట్ వంటి ఉన్నత విద్యలో సీటు సంపాదించుకున్నారు.
* ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్ 2021 ప్రకారం.. తెలంగాణలో ఉన్నత విద్యను పూర్తి చేసిన మైనారిటీ విద్యార్థుల సంఖ్య 5.8 శాతం పెరిగింది.
* సీమ్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకంలో భాగంగా విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు రూ. 20 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు ఫైట్ ఛార్జీలకు రూ. 60 వేలు అందిస్తున్నారు. ఈ పథకం కింద 2015-16 నుంచి 2022-23 వరకు 2975 విద్యార్థులకు గాను రూ. 462.23 కోట్లు ఖర్చు చేసింది.
* ట్యూషన్ ఫీ పథకం ద్వారా 2015 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం 77,802 మంది విద్యార్థులకు రూ. 30.01 కోట్లు ఖర్చు చేసింది. ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్ పథకం ద్వారా.. 2014-15 నుంచి 2022-23 వరకు 63,163 మంది మైనారిటీ విద్యార్థులకు గాను రూ. 116.20 కోట్లను ఖర్చు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..