Telangana: రెచ్చిపోయిన రియల్ వ్యాపారులు.. రైతులపై కర్రలతో దాడులు..
Telangana: అంగబలం, డబ్బు మదంతో రియల్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ రైతులపై దాడులకు తెగబడుతున్నారు.
Telangana: అంగబలం, డబ్బు మదంతో రియల్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ రైతులపై దాడులకు తెగబడుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని తంగెడపల్లిలో ఓ వెంచర్ యాజమాన్యం ఆగడాలు శ్రుతిమించాయి. రైతులపై కర్రలతో విరుచుకుపడింది. తమ భూమిలో వెంచర్ వేయడమేంటని ప్రశ్నించిన రైతులపై దాడులకు దిగింది. వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా మదమెక్కి ప్రవర్తించింది. ఎంతచెప్పినా వినకపోవడంతో రైతులకు సహనం నశించింది. వెంచర్ యాజమాన్యం బౌన్సర్లపై ప్రతిదాడికి దిగారు. తమ భూమిలో వెంచర్ వేసిందే కాకుండా.. దౌర్జన్యం చేస్తారా అంటూ దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
చౌటుప్పల్ దగ్గర ఎపిటోమ్ కంపెనీ ఓ వెంచర్ ప్రారంభించింది. ఆ కంపెనీ వెంచర్ వేసిన భూమి తమదంటూ తంగేడుపల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. భూమి తమదేనని.. ఆర్డీవో సర్వే కూడా చేసివెళ్లారని చెప్పారు. కావాలంటే ఆర్డీవోను అడిగి తెలుసుకోవాలని వెంచర్ సిబ్బందిని కోరారు. అయినా వినని వెంచర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. వెంచర్ బౌన్సర్లు.. రైతులపై కర్రలతో విరుచుకుపడ్డారు. ఆగ్రహించిన రైతులు ఎపిటోమ్ వెంచర్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఘర్షణలో రైతులు గాయపడ్డారు. దాడులపై ఇరువర్గాల ఫిర్యాదులతో పోలీసులకు దర్యాప్తు ప్రారంభించారు.