Telangana: గుంట నక్క అనుకుంటే పొరబడినట్టే.. ఈ రేర్ పీస్ ఎక్కడా చూసి ఉండరు.. అదేంటంటే.?

ఇంటి ఆవరణలో దాగి ఉన్న పునుగు పిల్లిని గమనించిన కుటుంబ సభ్యులు ధైర్యంగా వ్యవహరించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసర ప్రాంతాన్ని భద్రతా వలయంలోకి తీసుకున్నారు.

Telangana: గుంట నక్క అనుకుంటే పొరబడినట్టే.. ఈ రేర్ పీస్ ఎక్కడా చూసి ఉండరు.. అదేంటంటే.?
Telugu News

Edited By:

Updated on: Dec 16, 2025 | 1:50 PM

తిరుమల–తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాలు, దట్టమైన కొండ అడవుల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లులు ఇప్పుడు కరీంనగర్ లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సార్లు పునుగు పిల్లులు కనబడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని..ఈ జీవిని స్థానికులు..ఆసక్తి గా తిలకించారు. మళ్ళీ..కరీంనగర్ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి నివాసంలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానికులు ఒక్కసారి అవక్కాయారు.. ఇంటి ఆవరణలో దాగి ఉన్న పునుగు పిల్లిని గమనించిన కుటుంబ సభ్యులు ధైర్యంగా వ్యవహరించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసర ప్రాంతాన్ని భద్రతా వలయంలోకి తీసుకున్నారు. శ్రీలక్ష్మి జంతు సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు సుమన్ పటేల్, అటవీ వర్కర్ సంపత్ సహకారంతో ప్రత్యేక వలలను ఉపయోగించి పునుగు పిల్లిని ఎలాంటి గాయాలు కలగకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం దానిని పెట్టెలో భద్రపరిచి కరీంనగర్‌లోని డీర్ పార్క్‌కు తరలించారు. అయితే పట్టుబడిన పునుగు పిల్లి పూర్తిగా ఆరోగ్యంగా లేకపోవడంతో అక్కడి పశువైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడితే దానిని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు వెల్లడించారు.

గతంలోనూ పునుగు పిల్లుల సంచారం..

కరీంనగర్‌లో పునుగు పిల్లుల ప్రత్యక్షం ఇది మొదటిసారి కాదు. 2024 డిసెంబరు 3న కరీంనగర్ శివారులోని పద్మనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ గదిలోకి ప్రవేశించిన పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులు పట్టుకుని చొప్పదండి మండలం వెదురుగట్టు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 2024 అక్టోబరులో ప్రతిమ ఆసుపత్రి ఆవరణలో తల్లి పునుగు పిల్లి తన పిల్లలతో కలిసి కనిపించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పునుగు పిల్లలను పట్టుకుని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించగా, తల్లి పునుగు మాత్రం అక్కడినుంచి తప్పించుకుంది. ఇంతకుముందు కరీంనగర్ ప్రభుత్వ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో కూడా ఓ పునుగు పిల్లిని గుర్తించి, అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో వదిలివేశారు.

ఎందుకు నగరాల వైపు…?

తిరుపతి శేషాచలం అడవుల్లో నివసించే ఈ అరుదైన పునుగు పిల్లులు పట్టణ ప్రాంతాల్లో కనిపించడం వన్యప్రాణి నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, అడవుల్లో ఆహార కొరత, అటవీ ప్రాంతాలకు ఆనుకుని వేగంగా విస్తరిస్తున్న కాలనీలు, పరిశ్రమలు, రవాణా మార్గాలు వంటివే ఈ వన్యజీవులు నివాస ప్రాంతాల వైపు రావడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని వాగులు, కొండలు, వ్యవసాయ భూముల మార్గంలో పునుగు పిల్లులు దారి తప్పి నగరంలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి మానవ వన్యప్రాణి సంఘర్షణకు దారితీయవచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రజలు ఎలా స్పందించాలి..?

పునుగు పిల్లి కనిపించినప్పుడు భయపడి గుంపులుగా చేరడం, దానిపై దాడి చేయడం ప్రమాదకరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం, జంతువుకు దూరంగా ఉండడం ద్వారా ప్రాణ నష్టం నివారించవచ్చని సూచిస్తున్నారు. వన్యజీవుల సంరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, అరుదైన జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని అధికారులు పేర్కొంటున్నారు.

అరుదైన జాతి సంరక్షణ అవసరం..

పునుగు పిల్లులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయని, వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని నిపుణులు అంటున్నారు. కరీంనగర్ వంటి పట్టణాల్లో వీటి వరుస దర్శనాలు పర్యావరణ అసమతుల్యతకు సూచనగా కూడా భావించవచ్చని విశ్లేషిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..