Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది
Telangana News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ నెలలో ఏకంగా రెండు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 12న స్టార్ట్ కానున్న ఈ పథకాల వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రణామం అనే పథకం స్టార్ట్ చేయనుండగా.. ఇక చిన్నారుల కోసం బాల భరోసా అనే పథకం మొదలుపెట్టనుంది. జనవరి 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్దులు, పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాల వివరాలు ఏంటి..? వీటికి అర్హతలు ఏంటి? అనే విషయాలు ఒకసారి చూద్దాం.
దివ్యాంగులకు గిఫ్ట్
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అందులో భాగంగా వీరి సంక్షేమం కోసం ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దివ్యాంగులకు లబ్ది చేకూర్చనుంది. అంటే వారికి వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, బ్యాటరీ ట్రై సైకిళ్లు వంటికి అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది దివ్యాంగులను ఎంపిక చేశారు. వీరికి అవసరమైన పరికరాలను పంపిణీ చేయనున్నారు. విద్య, ఉపాధి కోసం అయితే ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అందించనున్నారు. ఇక మిగతావారికి వాళ్లకు అవసరమైన సైకిళ్లు, వాహనాలు వంటివి ప్రణామం పథకం ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా సమాజంలో వారు గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వం అండగా నిలవనుంది.
వృద్దుల కోసం కేర్ సెంటర్లు
ఇక ప్రణామం పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వృద్దుల కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇందులో వృద్దులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఒంటరిగా ఉంటున్న వృద్దుల కోసం ఈ డే కేర్ సెంటర్లలో మానసిక ఉల్లాసం కోసం అనేక సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. లైబ్రరీ, ఇండోర్ గేమ్స్‌తో పాటు టీవీ, ఇంటర్నెట్ వంటివి ఉంటాయి. ఇక వృద్దులకు ఉచితంగా పోషకాహరం ఈ సెంటర్లలో అందిస్తారు. ఒక జిల్లాలో రెండేసి చొప్పున డే కేర్ సెంటర్లను ప్రారంభించనుంది. ఇందుకోసం ఒక్కో సెంటర్‌కు ర.12.48 లక్షలు ఖర్చు చేయనుంది.
బాల భరోసా పథకం
పిల్లల కోసం బాల భరోసా పథకం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఉండే మానసిక, శారీరక వైకల్యాలను గుర్తించి చికిత్స అందించనుంది. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు టెస్టులు చేసి గుర్తించనున్నారు. ఏదైనా సమస్య ఉందని పరీక్షల్లో తేలితే ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించనుంది. సర్జరీలు, ఫిజియోథెరపీ వంటివి చేయించనుంది.
