AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాంబులతో పేల్చేసి.. జలసంపదను మాయం‌ చేయాలని చూశారు.. శనిగకుంటను చెరపట్టిందెవరు..?

రాష్ట్రమంతా చెరువులను కాపాడాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం దూసుకెళుతుంటే.. రాష్ట్ర రాజధానిలో‌ హైడ్రా కూల్చివేతలతో చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు‌పరిగెత్తిస్తున్నారు. అయితే మంచిర్యాల‌ జిల్లాలో మాత్రం కేటుగాళ్లు ఏకంగా చెరువులను కంటికి కనిపించకుండా మాయం చేయాలనే కుట్రలు చేస్తున్నారు.

బాంబులతో పేల్చేసి.. జలసంపదను మాయం‌ చేయాలని చూశారు.. శనిగకుంటను చెరపట్టిందెవరు..?
Chennur Shanigakunta
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 18, 2024 | 3:59 PM

Share

రాష్ట్రమంతా చెరువులను కాపాడాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం దూసుకెళుతుంటే.. రాష్ట్ర రాజధానిలో‌ హైడ్రా కూల్చివేతలతో చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు‌పరిగెత్తిస్తున్నారు. అయితే మంచిర్యాల‌ జిల్లాలో మాత్రం కేటుగాళ్లు ఏకంగా చెరువులను కంటికి కనిపించకుండా మాయం చేయాలనే కుట్రలు చేస్తున్నారు. అలా ఇలా కాదు ఏకంగా చెరువు మత్తడిని బాంబులతో పేల్చేసి చెరువులోని నీళ్లనంతా ఖాళీ చేసేలా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ చెరువే ఆధారంగా బతికే వందల మంది రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన మంచిర్యాల‌ జిల్లా చెన్నూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ లక్ష్యానికే సవాల్ విసిరేలా సాగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువును గుర్తు తెలియని దుండగులు.. డిటోనేటర్లను పెట్టి మరీ పేల్చేయడం స్థానికంగా సంచలనం రేపింది. నేషనల్ హైవే సమీపంలో ఉన్న శనిగకుంట మత్తడిని గుర్తు తెలియని దుండగులు పేల్చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన కాంక్రీట్ మత్తడిని పేల్చి వేసి కుంటలోని నీటిని మొత్తం ఖాళీ చేసేలా కుట్రలు పన్నారు. ఈ ఘటనతో 42 ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ కుంటను అంత ఈజీగా కూల్చేయలేదని, ఏకంగా 20 చోట్ల డిటోనేటర్లను పెట్టి మత్తడిని పేల్చివేశారని గుర్తించారు ఇరిగేషన్ అధకారులు. అయితే ఇంత దారుణానికి పాల్పడం వెనుక భారీ కుట్రనే ఉందని అనుమానిస్తున్నారు స్థానికులు.

అయితే చెరువు‌కట్టను కూల్చి వేయడం అంత ఈజీగా జరగలేదని, ఎవరి కంటపడకుండా పేల్చివేయాలనుకున్నారు. ముందస్తుగా రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ అమర్చి డిటోనేటర్లను అనుసంధానం చేసి పేల్చివేశారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కుంట మత్తడి ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేనందును డ్రిల్లింగ్ మిషనరీని ఉపయోగించేందుకు జనరేటర్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కుంట మత్తడిని పేల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు..? మత్తడి పేల్చేసేందుకు డిటోనేటర్లు ఎక్కడి నుండి తెచ్చారు అన్నది తేలాల్సి ఉంది..!

ఘటన స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అదికారులు మత్తడిని పరిశీలించి ఘటనకు‌ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి సైతం ఘటనపై సీరియస్ అవడంతో ఈ కుట్రకు కారకులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చెన్నూరు సీఐ రవిందర్ నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఘటనా స్థలాన్ని సందర్శించి.. ఘటనా స్థలం నుండి పేలుడు కోసం ఉపయోగించిన వైర్లను స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి స్పందించి చెరువు ఆయకట్టు రైతుల పంటకు నీరు అందేలా వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పేల్చివేసిన మత్తడిపై ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..