తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మూడు శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకపోవడంతో ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు తెలిపింది ఈసీ. అత్యధికంగా భువనగిరి అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదు అయింది. ఎన్నికల సరళి పై పూర్తిస్థాయి కసరత్తు చేసిన ఎలక్షన్ కమిషన్ తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకుగాను 65.67% నమోదయింది అయితే 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం అధికంగా నమోదు అయినట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 32 లక్షల 16 వేల మంది ఓటర్లు ఉంటే.. ఎన్నికల్లో రెండు కోట్ల 20 లక్షల 24 వేల మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఓటింగ్ శాతమే 66.3 గా నమోదు అయిందని పేర్కొన్నారు.
రెండు కోట్ల 20 లక్షల 24 వేల ఓటర్లలో రెండు కోట్ల 18 లక్షల 14 వేల మంది 35వేల పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మిగిలిన రెండు లక్షల పదివేల మంది పోస్టల్ బ్యాలెట్ హోం వోటింగ్ ద్వారా వినియోగించుకున్నారని వివరించింది. ఈ రెండు లక్షల పదివేల మందిలో 1,89,000 మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, 21,680 మంది వృద్ధులు హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల అధికారులు. అత్యధికంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో 76.78 శాతం నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.48 నమోదు అయింది.
ఆదిలాబాద్ 74.03 శాతం, పెద్దపల్లి 67.87, కరీంనగర్ 72.54 శాతం పోలింగ్.. నిజామాబాద్ 71.92, జహీరాబాద్ 74.63, మెదక్ 75.09 శాతం పోలింగ్.. మల్కాజ్‌గిరి 50.78, సికింద్రాబాద్ 49.04, శాతం పోలింగ్.. చేవెళ్ల 56.50, మహబూబ్‌నగర్ 72.43, నాగర్‌కర్నూల్ 69.46 శాతం పోలింగ్.. నల్గొండ 74.02, వరంగల్ 68.86 శాతం పోలింగ్.. మహబూబాబాద్ 71.85, ఖమ్మం 76.09 శాతం పోలింగ్ నమోదు అయినట్లు లెక్కలు విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్.
ఇక రికార్డు స్థాయిలో మెదక్ పార్లమెంట్ లోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 84.25 ఓటింగ్ శాతం నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మలక్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్లో 42. 76 శాతం నమోదు అయింది. ఏ విధంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 3,85,149 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో 1,05,383 మంది ఓటర్లు మాత్రమే ఇళ్లలోంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల 32 లక్షల మంది ఓటర్లు ఉంటే ఈ ఎన్నికలకు దూరంగా ఒక కోటి 11 లక్షల 91 వేల మంది ఓటర్లు ఉన్నారు.
కోటి 12 లక్షల మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నా గతంతో పోల్చితే మూడు శాతం పోలింగ్ పెరిగిందన్నారు ఎన్నికల అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఎండలు ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు సిఈఓ వికాస్ రాజ్. అదేవిధంగా 34 లొకేషన్స్‌లలో 44 స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాలు ఉన్నట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామని మరోసారి గుర్తు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…