Warangal: మాస్క్‌లో మంచోడు అనుకునేరు.. అసలు స్టోరీ తెలిస్తే కళ్లు తేలేస్తారు
అతను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కారు డ్రైవర్. కానీ కలెక్టర్‌కే షాక్ ఇచ్చాడు. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశాడు. అతనికి వేలాది రూపాయల సమర్పించుకొని మోసపోయామని గుర్తించిన బాధితులు అసలు కథ బయటపెట్టడంతో ఆ కేటుగాడి బాగోతం బయటపడింది.

వరంగల్‌లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సాధించిన ఈ వ్యక్తి జల్సాలకు అలవాటుపడి కొత్త తరహా మోసానికి తెరలేపాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేశాడు. కొందరికి ఏకంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్ పేరుతో ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశాడు ఈ ఘనుడు. వాళ్లు తీరా ఆ ఉద్యోగాలలో చేరడానికి వెళ్లిన తర్వాత అసలు బాగోతం బయటపడింది. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మంద కళ్యాణ్ అనే కార్ డ్రైవర్ ఇంత భారీ స్కెచ్ నడిపించాడని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. భవ్య కిరణ్, వంశీ అనే మరో ఇద్దరితో కలిసి ఇంత ఘరానా దోపిడీకి తెరలేపాడు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. 40 మంది నుంచి ఇప్పటివరకు 16 లక్షల 14 వేల రూపాయలు వసూలు చేసి ఎంజాయ్ చేసినట్టుగా గుర్తించారు. మంద కళ్యాణ్‌ను అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు ఇతని వద్ద 23 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, 39 సర్వీస్ బుక్స్, నకిలీ ఉద్యోగ నియామక పత్రాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఒక కారు సీజ్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంత భారీ దోపిడీకి పాల్పడిన మంద కళ్యాణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
