మునుగోడు యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇస్తే జిల్లా మొత్తం బాగుపడదని ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గుజరాత్‌కు గడిచిన ఐదు నెలల్లో 80 వేల కోట్ల రూపాయలిచ్చారని, తెలంగాణకు 18 వేల కోట్లు ఇవ్వలేరా అని ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే 18 వేల కోట్ల కాంట్రాక్ట్ విషయాన్ని టీఆర్‌ఎస్ ప్రస్తావిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై టీఆర్‌ఎస్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు టీఆర్‌ఎస్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొననున్నారు.
కాగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున నాంపల్లి మండలంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు ఒకటేనని విమర్శలు గుప్పించారు. మరో వైపు మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. తమ అభ్యర్థిగా జక్కుల ఐలయ్య యాదవ్ పేరును దాదాపుగా ఖరారు చేసింది. ఇక మునుగోడు ఉపఎన్నిక కోసం ఇప్పటి వరకు 32 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..