
ఓ వైపు మిగిలిన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు, సన్నాహక సమావేశాలతో బీజిగా ఉంటే.. ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించినప్పటికి అభ్యర్థి ఎవరూ అనే ప్రశ్న మళ్లీ ఉత్పన్నముతోందట కార్యకర్తలు, నాయకులకు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి కారణంగా పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గాన్ని చూట్టేస్తే ఆయన మాత్రం పాలమూరు నుంచి కదలడం లేదట.
ఎండల వేడికి ధీటుగా పాలమూరులో ఎంపీ ఎన్నికల వేడి కాక రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. అభ్యర్థులు ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచార జోరును పెంచేశారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం ఎన్నికల జోష్ కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. అభ్యర్థిత్వం ఖరారు అయినప్పటికి ఇప్పటివరకూ ప్రచారాన్ని ప్రారంభించలేదు. మహబూబ్ నగర్ నుంచి తొలుత బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని గులాబీ అధిష్టానం భావించినప్పటికీ నేతలు ముందుకు రాకపోవడంతో చివరకు సిట్టింగ్‌కే మళ్లీ సీటు దక్కింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటును కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి.
అయితే ఈ రేసులో ఇప్పటివరకు బీఆర్ఎస్ ఊసే లేకుండా పోయింది. అభ్యర్థిని ప్రకటించినప్పటికీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇప్పటివరకూ ఒక్క పర్యటన చేయలేదని గులాబీ క్యాడర్ నిరాశలో ఉన్నారట. ఓ వైపు ఇదే పార్టీ నుంచి పక్కనే ఉన్న నాగర్ కర్నూల్ అభ్యర్థి సమావేశాలు, ర్యాలీలతో బీజీగా ఉంటే పాలమూరులో మాత్రం గులాబీ చప్పుడే లేదని వాపోతున్నారట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే పాలమూరు న్యాయ్ యాత్ర చేయగా, బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రతో పార్లమెంట్ పరిధిని చుట్టేశారు. ఇక క్షేత్ర స్థాయిలో మీటింగ్‌లు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో బీజీగా ఉంటున్నారు. అయితే గులాబీ అభ్యర్థి మాత్రం అడ్రస్ లేడని రాజకీయవర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. అసలు ప్రచారాన్ని సైతం ప్రారంభించలేదు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తే ఎన్నికలకు చాలా సమయం ఉందన్న సమాధానాలు వినిపిస్తున్నాయట. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ధీటైన అభ్యర్థి కాకపోవడంతో ప్రచారంలో అందరికంటే ముందుండాలని క్యాడర్‌తో పాటు, ముఖ్య నేతలు భావిస్తున్నారట. అభ్యర్థి ప్రకటన జరిగినా ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించడం లేదనే ప్రశ్నలు క్యాడర్‌ను తొలుస్తున్నాయట. కొందమంది నేతలైతే పోటీలో ఉంటారో లేక తప్పుకుంటారోనని కామెంట్స్ చేస్తున్నారట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..