Telangana: ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ.. ఆ పార్టీతో కొనసాగుతోందని వెల్లడి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి పొత్తుల పై రాజకీయ చర్చ సాగుతోంది. అధికారికంగా ఏ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకోనప్పటికి.. పలనా పార్టీతో పొత్తు పెట్టేకునే అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి పొత్తుల పై రాజకీయ చర్చ సాగుతోంది. అధికారికంగా ఏ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకోనప్పటికి.. పలనా పార్టీతో పొత్తు పెట్టేకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే బీజేపీ, టీఆర్ ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే, ఎప్పటికైనా టీఆర్ ఎస్,కాంగ్రెస్ ఒకటేనని, వచ్చే శాసనసభ ఎన్నికల తర్వాత అయినా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ మాత్రం తమకు ఏ పార్టీతో పొత్తులు ఉండబోమని తాము ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ఖండిస్తూ వస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన మాత్రం పొత్తుపెట్టుకుంటాయని, ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే ప్రచారం ఇటు టీడీపీ, అటు జనసేనలోనూ వినిపిస్తోంది. వైసీపీ మరోసారి ఏపీలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే పొత్తులపై అధికారికంగా ఆయా పార్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఒబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి పార్టీలకు పొత్తులకు సంబంధించి అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే బీజేపీ నేత లక్ష్మణ్ ప్రస్తుతం పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. పొత్తుల విషయంలో పార్లమెంటరీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈక్రమంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హైదరాబాద్ లో డాక్టర్ కె.లక్ష్మణ్ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ అధినేత, సీఏం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ తుది లక్ష్యమని, ఇక్కడి ప్రజలు కూడా బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఆలోచన లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆశ లేదని, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా తనను నియమించడమే కేంద్ర మంత్రిపదవిగా భావిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈ పదవి పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం డాక్టర్ం లక్ష్మణ్ కేసీఆర్ జాతీయ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని జోస్యం కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకుంటోందని డాక్టర్ లక్మణ్ ఆరోపించిన విషయం విదితమే. ఇది చాలక దేశాన్ని దోచుకోవడానికి జాతీయ పార్టీ అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉట్టికి ఎక్కలేని వ్యక్తి, ఆకాశానికి నిచ్చెన వేసినట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉందని లక్మణ్ కేసీఆర్ పై మండిపడిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..