Telangana: ఇదే మంచి అవకాశంగా భావిస్తున్న బీజేపీ.. అధిాకారమే లక్ష్యంగా భారీ వ్యూహం..!

Telangana: బీజేపీ సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు తెలంగాణకు దండయాత్రగా వస్తున్నారు. తెలంగాణలో పాగా వేస్తామంటున్న కమలనాథులు..

Telangana: ఇదే మంచి అవకాశంగా భావిస్తున్న బీజేపీ.. అధిాకారమే లక్ష్యంగా భారీ వ్యూహం..!
Bjp
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Jul 01, 2022 | 4:34 PM

Telangana: బీజేపీ సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు తెలంగాణకు దండయాత్రగా వస్తున్నారు. తెలంగాణలో పాగా వేస్తామంటున్న కమలనాథులు.. అందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలే మంచి అవకాశమని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారితో ఆయా రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఎల్లుండి మొదలు కానున్నాయి. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆ సభకు విజయ సంకల్ప సభగా బీజేపీ పేరు పెట్టింది.

ప్రముఖుల రాక.. 2వ తేదీన మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్‌–హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు మధ్యాహ్నమే హైదరాబాద్‌కు చేరుకుంటారు. నోవాటెల్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో పాల్గొని జాతీయ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్నారు. సమావేశాలు, మోదీ సభకు ఏర్పాట్ల తుది పరిశీలన నిమిత్తం పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు.

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కమలనాథులు. వారితో శుక్రవారం, శనివారం ఆయా రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం నాడు హర్యానా, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ వాళ్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక, కశ్మీర్‌ పండిట్స్‌, కేరళకు చెందిన వారితో భేటీలు ఉంటాయి.

శుక్రవారం నాడు హర్యానా వాళ్ళతో సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ కట్టర్ హాజరు కానున్నారు. తమిళ్ కమ్యూనిటీ సమావేశంలో కుష్బు, అన్నామలై, మురుగన్ పాల్గొంటారు. ఈ సమావేశం నేరెడ్‌మెట్‌లో ఏర్పాటు చేశారు. రామ్‌కోటిలోని గుజరాత్ భవన్‌లో జరిగే గుజరాతీల సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రుపాని హాజరవుతున్నారు. మధ్యప్రదేశ్‌ వారితో సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ పాల్గొంటారు. ఈ మీటింగ్‌ కూకట్‌పల్లిలో జరుగుతుంది. రాజస్థాన్‌ కమ్యూనిటీతో రెండు సమావేశాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ SS కన్వెన్షన్ హాల్‌లో, సాయంత్రం నాంపల్లి క్వాలిటీ ఇన్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. రాజస్థానీయులతో మీటింగ్‌లకు ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే హాజరవుతారు. పంజాబీల సమావేశం బ్లూ ఫాక్స్ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు రానున్నారు.

శనివారం ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో మాదాపూర్‌, బంజారా హిల్స్‌లో సమావేశాలు ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సమావేశాలకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఇతర ఈశాన్య రాష్ట్రాల సీఎంలు అటెండ్ అవుతారు. కన్నడిగులతో సమావేశం కర్ణాటక సాహిత్య మందిర్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై హాజరవుతారు. కాశ్మీర్ పండిట్స్‌తో మీటింగ్‌ హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేశారు. ఇక మలయాళీల సమావేశానికి మురళీధరన్, కృష్ణదాస్ వస్తున్నారు. మల్కాజ్‌గిరి కమ్యూనిటీ హాలులో ఈ సమావేశం జరగనుంది.

మొత్తానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల హడావుడి మామూలుగా లేదు. తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ నియోజకవర్గానికి ఒక్కో జాతీయ నేతను పంపి సరికొత్త ప్రచారానికి తెరలేపింది. 119 నియోజకవర్గాలకు పంపే 119 కీలక నాయకుల పేర్లను అనౌన్స్‌ చేసింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, నడ్డా, యోగి అదిత్యనాథ్ తదితరులు పాల్గొని ప్రచారం చేశారు. అదే తరహాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారు. అందులో భాగంగా జాతీయ కార్యవర్గం కోసం వచ్చే నేతలను ప్రతి నియోజక వర్గానికి పంపుతున్నారు. ఇవాళ, రేపు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో జాతీయ స్థాయి నేతలు పర్యటిస్తారు. బూత్‌ కమిటీల ఏర్పాటు పై సమీక్షిస్తారు. ఆ నియోజకవర్గాల్లో ప్రముఖ అలయాలను సనదర్శిస్తారు. కార్యకర్తల ఇళ్లలో బస చేస్తారు. నియోజకవర్గాల్లో పర్యటించే జాతీయ పార్టీ హైకమాండ్‌కి నేతలు నివేదికలు ఇవ్వనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu