
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి స్థానాన్ని బిజెపి ప్రతిస్తాత్మకంగా తీసుకుంటుంది. నల్లగొండ పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా..? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కమలం పార్టీ గాలం వేసిందా..? నల్లగొండ జిల్లాలో బలమైన నేతలను తమవైపు తిప్పుకోవాలని కాషాయదళం ప్రయాత్నలు చేస్తోందా..? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొందరు గులాబీని విడిచి.. కమలం వైపు అడుగులు వేయాలనుకుంటున్నారా..? అందుకోసమే బిజెపి నల్లగొండ స్థానాన్ని పెండింగ్ పెట్టిందా..? వీటన్నింటికీ సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మూడోసారి గెలిచి, మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధించాలని ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. హైదరాబాద్ ఆనుకుని ఉన్న పార్లమెంటు స్థానాలపై బిజెపి స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై బిజెపి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే భువనగిరి నుంచి బిజెపి అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను ప్రకటించింది. కానీ నల్లగొండలో బలమైన అభ్యర్థి కోసం బిజెపి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇటీవల బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పెద్ద ఎత్తున నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అందులో బలమైన నేతలు ఎవరూ లేరని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారట. ఈక్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకోవాలని టి. బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిజెపి పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో తమ ముందు ఉన్న అన్ని అస్త్రాలకు పదును పెడుతుంది. ఇందులో భాగంగా సొంత పార్టీలోని నేతలతోపాటు.. పక్క పార్టీలోని బలమైన నేతల పేర్లను పరిశీలిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నల్లగొండ పార్లమెంటు పరిధిలో బలమైన బీఆర్ఎస్ నేతలను తమవైపు తిప్పుకోవాలని ప్రయాత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీలతో బీజేపీ నేతలు చర్చలు జరిగాయంటున్నారు పార్టీ శ్రేణులు. మరోసారి అధికార పార్టీలో ఉండాలని గట్టిగా భావిస్తున్న మాజీలు.. గులాబీని విడిచి కమలం వైపు అడుగులు వేయాలనుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావును కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో దించేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే భాస్కర్ రావు గులాబీని వీడేందుకు సుముఖంగా లేరని తెలిసింది. గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టిన బిజెపి భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నల్లగొండ నుంచి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలపాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. దీంతో హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బిజెపి జాతీయ నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైదిరెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ టూర్‌కు కూడా గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. ఆర్థికంగా బలమైన నేతను బరిలోకి దింపాలని భావిస్తున్న బిజెపి.. సైదిరెడ్డి పేరును బిజెపి లిస్టులో టాప్ ప్రియారిటిలో ఉన్నట్లు కమలం నేతలు చెబుతున్నారు. రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపిలో చేరాలా వద్దా అనే అంశంపై సైదిరెడ్డి తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. బిజెపి ఇస్తున్న ఆఫర్‌పై మాజీ ఎమ్మెల్యే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బిజెపి పార్టీయేనని బలంగా భావిస్తున్న సైదిరెడ్డి కూడా ఆ పార్టీ అవకాశం ఇస్తే ఛాన్స్ మిస్ చేసుకోవద్దని.. అలాగని అవకాశం కోసం వెంపర్లాడవద్దని భావిస్తున్నారట. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…