Khammam: వారెవ్వా.. ఖమ్మం సీటు గెలిచేందుకు బీజేపీ మాస్టర్ స్కెచ్..
ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి... దాన్ని ఖమ్మం సీటు విషయంలో అప్లయ్ చేయాలనుకుంటోంది బీజేపీ. టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే కమ్మవర్గం ఖమ్మంలో బలంగా ఉంది. కాబట్టి, అక్కడ టీడీపీ మూలాలు ఉన్న బలమైన నాయకుడి కోసం.. ఖమ్మం సీటును హోల్డ్‌లో పెట్టింది బీజేపీ.

ఖమ్మం ఎంపీ సీటు .. తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రధానపార్టీలన్నీ కన్నేయడంతో ఉమ్మడిజిల్లాలో ఉన్న ఈ ఒకేఒక్క పార్లమెంటు సీటు… పొలిటికల్‌గా పొగలురాజేస్తోంది. సెగలు గక్కుతోంది. అప్ కీ బార్.. చార్ సౌ పార్ అంటున్న బీజేపీ ఈ దఫా దక్షిణాదిన దంచికొట్టాలని భావిస్తోంది. సౌత్‌కు ముఖద్వారం లాంటి తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవాలన్న కసితో పనిచేస్తోంది కమలదళం. అందుకే ఖమ్మం గుమ్మంలో అభ్యర్థి ఎంపికపై బీభత్సమైన కసరత్తు చేస్తున్నారు కాషాయ పెద్దలు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత ఊపున్నా.. ఖమ్మంలో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. దీంతో, ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకే… ఖమ్మం ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరిగింది. ఆయనను పార్టీలోకి తీసుకున్నది కూడా అందుకేనన్న ముచ్చటా వినిపించింది. కాకపోతే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఖమ్మం గెలవాలంటే క్యాస్ట్ ఈక్వెషన్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని కమలం పెద్దలు. .. కాస్త లేట్‌గా అయినా తెలుసుకున్నట్టు అనిపిస్తోంది. కమ్మ సామాజికవర్గంతో పాటు, ఏపీ బేస్డ్ పబ్లిక్ ఎక్కువగా ఉండే ఖమ్మంలో… పొలిటికల్ లెక్కలు వేరేలా ఉంటాయి. అందుకే, బలమైన కాంగ్రెస్ మూలాలు ఉన్న జలగం వెంకట్రావును కాస్త హోల్డ్‌లో పెట్టి… మరో నేత కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జలగం మాత్రం.. సీటు తనకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి… దాన్ని ఖమ్మం సీటు విషయంలో అప్లయ్ చేయాలనుకుంటోంది బీజేపీ. టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే కమ్మవర్గం ఖమ్మంలో బలంగా ఉంది. కాబట్టి, అక్కడ టీడీపీ మూలాలు ఉన్న బలమైన నాయకుడి కోసం.. ఖమ్మం సీటును హోల్డ్‌లో పెట్టింది బీజేపీ. అయితే, ఖమ్మంలో టీడీపీ బేస్ ఉన్న బడా నాయకుడు నామా నాగేశ్వరరావు. ఆయనకు టీడీపీ నుంచి గెలుపొందిన హిస్టరీ కూడా ఉంది. అందుకే ఆయనైతే కచ్చితంగా ఈ సీటును గెలవగలమని అంచనా వేస్తోంది బీజేపీ. అయితే, సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామాను మరోసారి తమ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్‌ఎస్. ప్రచారం కూడా మొదలైంది. అయినా సరే కమలం నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఈ టచ్ పాలిటిక్స్‌తో ఏం జరగబోతోందన్నదే ఆసక్తి రేపుతోంది. ఖమ్మం బరిలో నామా బీఆర్‌ఎస్ నుంచే నిలబడతారా? బీజేపీ సైడ్ తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్. అనూహ్య పరిణామాలు జరిగితే బీఆర్‌ఎస్ ఏం చేస్తుందన్నది చూడాలి. సేమ్ టు సేమ్ బీజేపీ ఫార్ములాలోనే.. మరో కమ్మ సామాజికవర్గం నేతను బరిలో దింపుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ నామా సైడ్ మారిస్తే.. జలగం మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారా? లేక అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థికి మద్దతిస్తారా? అన్నదీ ఆసక్తికర విషయమే. అటు కాంగ్రెస్‌లో ఇప్పటికే టిక్కెట్ కోసం నేతల మధ్య వార్ నడుస్తోంది. పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, మల్లు నందిని మధ్య నువ్వానేనా అన్నట్టుగా టిక్కెట్ వార్ నడుస్తోంది. అటు తుమ్మల తనయుడు కూడా సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లినా ప్రయోజనం ఉండదు కాబట్టి… జలగం తిరిగి గులాబీ గూటికి వచ్చేస్తారా? అన్నదీ చర్చనీయాంశంగానే మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
