Big News Big Debate: రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌.. రాజ్యాంగబద్ధంగానే రాజ్‌భవన్‌ వ్యవహరించిందా?

సెక్రటేరియట్‌లో ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజీ కుదిరినట్టు భావించినా ఎమ్మెల్సీ ఫైల్‌ మరోసారి చిచ్చు రాజేసింది.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్‌ చేయాలంటూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి జులై 31న రాజ్‌భవన్‌కు పంపారు. నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వచ్చినా పరిశీలనలో ఉందని చెబుతూ వచ్చింది రాజ్‌భవన్‌.

Big News Big Debate: రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌.. రాజ్యాంగబద్ధంగానే రాజ్‌భవన్‌ వ్యవహరించిందా?
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2023 | 7:12 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో రాష్ట్ర క్యాబినెట్‌ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఫైల్‌ను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి సమాచారం పంపించారు. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారని.. వారిని కాకుండా రాజకీయ నాయకులను నామినేట్‌ చేయడం సరికాదంటూ రిజెక్ట్‌ చేశారు గవర్నర్‌. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ రచ్చ రాజుకుంది. గవర్నర్‌ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్‌ అంటోంది. రాజ్యంగబద్ధంగానే నిర్ణయాలు ఉంటాయని బీజేపీ అంటోంది.

సెక్రటేరియట్‌లో ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజీ కుదిరినట్టు భావించినా ఎమ్మెల్సీ ఫైల్‌ మరోసారి చిచ్చు రాజేసింది.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్‌ చేయాలంటూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి జులై 31న రాజ్‌భవన్‌కు పంపారు. నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వచ్చినా పరిశీలనలో ఉందని చెబుతూ వచ్చింది రాజ్‌భవన్‌. తాజాగా గవర్నర్‌ తమిళిసై ఫైల్‌ను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఆర్టికల్ 171(5) ప్రకారం ఇద్దరికీ అర్హతలు లేవని.. రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లను పంపాలని సూచించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని.. సామాజిక సేవా కార్యక్రమాల్లో వీరిద్దరి పాత్ర గురించి ఎక్కడా ప్రస్తావించలేదని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై నేరుగా తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టలేదా అంటూ ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. రాజకీయం కూడా సామాజికసేవలో భాగమేనని గుర్తు చేశారు మంత్రి. గవర్నర్‌ ఓ పార్టీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని.. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. క్యాబినెట్‌ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని.. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్దమన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. పార్టీలు ఫిరాయించేవాళ్లు, రాజకీయ నాయకులను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నామినేట్‌ చేస్తారని ప్రశ్నించారు మంత్రి కిషన్‌ రెడ్డి. గతంలోనూ పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫారసును అప్పట్లో తిరస్కరించారు. ఈ వ్యవహారంతోనే ప్రగతి భవన్ – రాజ్ భవన్ మధ్య దూరం పెరిగింది. మళ్లీ ఎమ్మెల్సీల నియామకం మరో చిచ్చు రాజేసింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..