Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణలో పాతుకుపోవడమే టార్గెట్.. క్షేత్రస్థాయి ప్రక్షాళన షురూ..!

తెలంగాణ బీజేపీ క్షేత్రస్థాయి ప్రక్షాళన షురూ అయ్యింది. ముందుగా జిల్లాలు, మండలాలపై నజర్‌ వేసింది. త్వరలోనే ప్రతీ జిల్లాకు అధ్యక్షుల ఎంపిక జరగబోతోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక ఫిబ్రవరి 10 నాటికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుందని.. బీజేపీ కొత్త రథసారథి త్వరలోనే రానున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Telangana BJP: తెలంగాణలో పాతుకుపోవడమే టార్గెట్.. క్షేత్రస్థాయి ప్రక్షాళన షురూ..!
Telangana Bjp
Follow us
Vidyasagar Gunti

| Edited By: Balaraju Goud

Updated on: Jan 31, 2025 | 7:58 PM

తెలంగాణలో పాతుకుపోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపికకు అంతా రెడీ చేసుకుంది. ఇక అభ్యర్థులు నామినేషన్లు వేస్తే.. లిస్టు ప్రకటించడమే తరువాయి..! ఈ నేపథ్యంలో తమకు నచ్చిన వారిని జిల్లా అధ్యక్షులుగా చేయడానికి కొందరు ముఖ్యనేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జిల్లాల లిస్టు వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షుడి పేరు కూడా వస్తుందని కమలం పార్టీ నేతలంటున్నారు.

మొత్తానికి తెలంగాణ బీజేపీ క్షేత్రస్థాయి ప్రక్షాళన షురూ అయ్యింది. ముందుగా జిల్లాలు, మండలాలపై నజర్‌ వేసింది. త్వరలోనే ప్రతీ జిల్లాకు అధ్యక్షుల ఎంపిక జరగబోతోంది. సంక్రాంతికే అనుకున్నా.. వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం(ఫిబ్రవరి 1) నామినేషన్లను స్వీకరించరున్నారు. దాదాపు 27 జిల్లాలకు జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను అధిష్టానం పూర్తి చేయగా.. వారి నుంచి నామినేషన్లు తీసుకుని లిస్టును ప్రకటించడమే మిగిలి ఉంది.

తెలంగాణలో 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా జిల్లాల అధ్యక్షులు ఎంపిక పూర్తి అయితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో 20కి పైగా జిల్లాల అధ్యక్షులు ఎంపిక పూర్తి చేయాలని చాలా రోజుల నుంచి కమలం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో 27 జిల్లాల అధ్యక్షులపై నేతలు ఏకాభిప్రాయానికి రావడంతో వారి ఎంపిక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.

సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అవుతోంది బీజేపీ. అందుకే త్వరగా పార్టీ నేతలకు ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాలని చూస్తోంది. జనవరి నెలలోనే జిల్లా అధ్యక్షులు ఎంపికలతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక కూడా పూర్తి చేయాలని భావించింది. కానీ కొన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికలో సమన్వయం లేకపోవడం, పైరవీలు పెరగడంతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో తమ మనుషులనే జిల్లా అధ్యక్షులుగా చేయాలన్న పట్టుదలతో ముఖ్య నేతలు ఉండడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరితో సమన్వయం చేసుకుని బిజెపి రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాబితాను అధిష్టానానికి పంపడంతో అందులోని పేర్లను బీజేపీ అధిష్టానం క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారులతో సునీల్ భన్సల్, కిషన్ రెడ్డి, అరవింద్ మీనన్, అభయ్ పార్టీ జిల్లాల నేతలతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో జిల్లా అధ్యక్షుల ఎంపికకు లైన్ క్లియర్ చేస్తూ.. శనివారం నామినేషన్లు తీసుకోవాలని, ఆదివారం జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయాలని సూచించారు. తొలుత రాష్ట్ర నేతలు ఒక్కో జిల్లాకు ముగ్గురు పేర్ల చొప్పున జాబితాను పంపగా అందులోంచి ఒక్కొక్కరి పేరును అధిష్టానం సెలెక్ట్ చేసి తిరిగి పంపితే వారి దగ్గర నుంచి నామినేషన్లను శనివారం తీసుకొనన్నారు. మిగిలిన జిల్లాల అధ్యక్షులకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.