Bhadrachalam: ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. ప్రకటించిన ఆలయ వైదిక కమిటీ
Bhadrachalam: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 13 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామనవ...
Bhadrachalam: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 13 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలని వైదిక కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను దేవస్థానం ఈవో బానోతు శివాజీ ప్రభుత్వానికి విన్నవించింది. ఏప్రిల్ 13న ఉగాది నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు కలపనున్నారు.
13న చైత్రశుద్ధ పాడ్యమి ప్లవ నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా మూల మూర్తుల స్నపన తిరుమంజనం, ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం నూతన పంచాంగ శ్రవణం, ఆస్థానం, శ్రీస్వామి వారికి తిరువీధిసేవ, 17న మృత్సంగ్రహణం వాస్తు హోమం, అంకురార్పణ, 18న భగవత్ రామానుజ జయంతి, గరుఢ ధ్వజపట లేఖనం, ఊరేగింపు నిర్వహిస్తారు.19న ధ్వజారోహణం, 20న యాగశాలలో చతుస్థానార్చనలు నిర్వహించి వేడుకగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
అలాగే 21న శ్రీసీతారాములకు అభిజిత్ లగ్నంలో తిరుకల్యాణోత్సవం నిర్వహించి 22న మహాపట్టాభిషేకం, అదే రోజు రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. 23న వేదాశీర్వచనం, 24న కల్యాణ రాముడి విహారం, 25న రాత్రి బంగారు ఊయలలో స్వామివార్లకు ఊంజల్ సేవ చేస్తారు. 26న వసంతోత్సవం, సుదర్శనహోమం, గజవాహన సేవ, 27న పవిత్ర గోదావరిలో చక్రతీర్థం, ధ్వజారోహణం, దేవతోద్వాసన, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగంతో పూర్ణాహుతి అనంతరం బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.