Art Director Chandra: ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర ఇకలేరు.. కరోనా చికిత్స పొందుతూ కన్నుమూత

ప్రముఖ చిత్రకారుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర (74) అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా మహమ్మారి కాటుకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు.

Art Director Chandra: ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర ఇకలేరు.. కరోనా చికిత్స పొందుతూ కన్నుమూత
Art Director And Writer Chandra

Art Director and Writer Chandra: ప్రముఖ చిత్రకారుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర (74) అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా మహమ్మారి కాటుకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. మూడేళ్లుగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఆయనకు కరోనా తోడైంది. దీంతో సికింద్రాబాద్ మదర్ థెరిసా రీహబిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. చంద్ర పార్థివ దేహన్ని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు.

వరంగల్ జిల్లాకు చెందిన రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్రశేఖర్ ఆగస్ట్ 28, 1946లో జన్మించారు. సర్వశ్రీ శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో ఆయన చిత్రలేఖనం ఎంచుకున్నారు. యుక్తవయసు నుండే రేఖా చిత్రాలు గీయడం ప్రారంభించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా వార, మాస పత్రికలకు బొమ్మలు గీసిన ఖ్యాతిగడించారు. విరసంలోనూ కొంతకాలం యాక్టివ్‌గా పనిచేసిన చంద్ర తర్వాత దానికి దూరమయ్యారు.

ఆయన 70వ జన్మదిన సందర్భంగా 2016లో మిత్రులంతా ఆయనతో ఉన్న అనుభవాలను ‘ఒక చంద్రవంక’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. నాలుగు దశాబ్దాల పాటు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్స్, రంగుల్లో బొమ్మలు, కార్లూన్లు, పెయింటింగ్స్, గ్రీటింగ్ కార్డులు, లోగోలు గీసిన చంద్రకు దేశ విదేశాలలో కోట్లాది మంది అభిమానులు వున్నారు. వేల సంఖ్యలో నవలలకు కవర్ పేజీలు వేశారు. దశాబ్దాల పాటు వార ప్రతికలకు పండగ సమయాల్లో కవర్ పేజీలు గీశారు. ఇక ఆయన కథలకు, కవితలకు ఆయన వేసిన బొమ్మలు లెక్కపెట్టలేనన్ని.

పలు పత్రికలకు బొమ్మలు గీస్తూనే, కేతు విశ్వనాథ రెడ్డి గారి కోరిక మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరారు. బి.నరసింగరావుతో ఉన్న అనుబంధంతో ఆయన చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయడమే కాకుండా కొన్ని సినిమాలలో నటించారు. మరికొన్ని చిత్రాలలో అతిథి పాత్రలు సైతం పోషించిన చంద్ర, టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. చక్కని కథలూ రాశారు. అలానే వేలాది కార్టూన్ల గీశారు. ఆయన షష్టి పూర్తి సందర్భంగా 2006లో ‘చంద్ర కార్టూన్లు’ పుస్తకం విడుదల కాగా, వాహిని బుక్ ట్రస్ట్ సంస్థే 2013లో చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు ను ప్రచురించింది.

ఇదిలావుంటే, గత కొంతకాలంగా ఆయన సికింద్రాబాద్ కార్ఖానాలోని మదర్ థెరిసా హెల్త్ కేర్ సెంటర్ లో ఉంటున్నారు. చంద్రకు భార్య భార్గవితో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Read Also…  Ashok Gehlot: ముఖ్యమంత్రులను వెంటాడుతున్న కరోనా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌కు పాజిటివ్..