Telangana: ఆదిలాబాద్‌లో ఒకలా.. నిర్మల్‌లో మరోలా.. విచిత్ర పరిస్థితులు.. నిరాశలో రైతులు..
Adilabad: వర్షాకాలంలోనూ పంట పొలాలు బీడుల్లా మారుతున్నాయ్. వర్షాలు, వరదలతో అట్టుడికిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

Adilabad: విస్తారంగా వర్షాలు పడ్డాయ్, ఊర్లకే ఊర్లే మునిగిపోయేలా వరదలూ ముంచెత్తాయ్, అధిక వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డా, రైతన్నలు మాత్రం పంటలు సాగు మొదలుపెట్టారు. వర్షాధారిత పంటలతోపాటు పెద్దఎత్తున వరి నాట్లు వేశారు. అలా నాట్లు వేశారో లేదో, అంతలోనే వర్షాలకు బ్రేక్ పడింది. దాంతో, ఎన్నో ఆశలతో వరి నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు వర్షాల్లేక, మరోవైపు సక్రమంగా విద్యుత్ సప్లై లేక పంట భూములు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వరి నాట్లు నాటిన పొలాల్లో నేల నెర్రలు చాచడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు.
నిర్మల్ జిల్లాలోని పరిస్థితి ఇది. నిర్మల్ మండలం బావపూర్ గ్రామంలో వర్షాల్లేక, మరోవైపు త్రీఫేజ్ కరెంట్ సప్లై లేక, పంట భూమి ఇలా బీడుగా మారిపోయింది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతోనే బోర్ల నుంచి సాగునీరు అందడం లేదంటున్నారు రైతులు.




మారుమూల గ్రామాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉందంటున్నారు రైతులు. వరి మడులు ఎండిపోయి పొలాలు బీడు భూముల్లా మారుతున్నాయని అంటున్నారు. వరి రైతులు నష్టపోకుండా ఉండాలంటే త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
