AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: ఆత్మహత్యలొద్దు.. ఆకతాయిలను చంపేయండి.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్..

తొక్కేస్తున్నారు.. ఇంతపెద్ద తెలంగాణ సాధించి ఒకరిద్దర్ని మాత్రమే ఆడవాళ్లకు ప్రతినిధులుగా చూపిస్తున్నారు.. వాళ్లే సర్వస్వం అన్నట్లు మాట్లాడుతున్నారు. అడిగితే రాళ్లేస్తున్నారు.. రాళ్లేసిన వాళ్లకే బహుమానాలిస్తున్నారు..

Poonam Kaur: ఆత్మహత్యలొద్దు.. ఆకతాయిలను చంపేయండి.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్..
Poonam Kaur
Shiva Prajapati
|

Updated on: Mar 07, 2023 | 7:54 AM

Share

తొక్కేస్తున్నారు.. ఇంతపెద్ద తెలంగాణ సాధించి ఒకరిద్దర్ని మాత్రమే ఆడవాళ్లకు ప్రతినిధులుగా చూపిస్తున్నారు.. వాళ్లే సర్వస్వం అన్నట్లు మాట్లాడుతున్నారు. అడిగితే రాళ్లేస్తున్నారు.. రాళ్లేసిన వాళ్లకే బహుమానాలిస్తున్నారు.. రేపటి మహిళా దినోత్సవానికి ముందురోజున ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ పేల్చిన బాంబులివి. అంతేకాదు.. తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది. మరి పూనమ్ ఎందుకలా అన్నది.. అసలేం జరిగింది? ఇంకా ఏంఏం కామెంట్స్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

నటి పూనమ్‌కౌర్ మాటల్లో ఊహకందని భావోద్వేగం..

పూనమ్‌కౌర్‌ మాటల్లో ఉన్నది ఆగ్రహమా అంటే కాదు. ఆవేదన. ఏదో నష్టపోయానాన్న ఆవేదన. ఏదో కోల్పోతున్న ఆవేదన. ఇంకేదో తనను శాశిస్తోందన్న ఆవేదన. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉమెన్స్‌ డే వేడుకల్లో.. గుండెలో గూడుకట్టుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఆవేదనంతా బయటపడింది. అవును, నటి పూనమ్‌కౌర్ మాటల్లో ఊహకందని భావోద్వేగం కనిపించింది. ‘నన్ను పంజాబీ అమ్మాయి అంటున్నారు. నన్ను తెలంగాణ నుంచి వేరు చేసి చూస్తున్నారు. నేను పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ. నా మతాన్ని సాకుగా చూపించి నాది తెలంగాణ కాదంటారా?’ అని తీవ్ర భావోద్వేగానికి గురైంది.

అయితే, పూనమ్ కౌర్ ఈ మాటలు అనడానికి ముందు అదే వేదికపై మాట్లాడారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. తెలంగాణ గడ్డపై ఆమె ఇప్పటికే అనేక అవమానాలు భరించినట్లు చెప్పారు. ఆ మాటలకు సంఘీభావం తెలుపుతూ.. పూనమ్‌ కూడా తన ఆవేదన వెళ్లగక్కారు. ఇంతకీ పూనమ్‌లో భావోద్వేగాన్ని రేకెత్తించేలా అంతకుముందు గవర్నర్ ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

‘తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయ్. భవిష్యత్‌పై ఎన్నో కలలుగన్న మెడికో ప్రీతి మరణం తెలంగాణలో మహిళల స్థితిగతులకు అద్దం. రాష్ట్రంలో అత్యున్నస్థాయి మహిళనే కించపరుస్తున్నారు. కించపరిచిన వాళ్లకు బహుమానాలు అందుతున్నాయి. ఆమె మీద రాళ్లేసిన వాళ్లకు పూలదండలేస్తున్నారు.’ అంటూ తెలంగాణలో ఆడబిడ్డల పరిస్థితిపై తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్‌కౌర్‌..

గవర్నర్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వెళ్లగక్కిన పూనమ్‌కౌర్‌. మేడమ్‌.. మీ మాటలు అక్షరసత్యం అంటూ మద్దతిచ్చారు పూనమ్. తనను కూడా తెలంగాణ కాదని వేధిస్తున్నట్లు చెప్పిన పూనమ్.. మైనార్టీగా ఉన్న తనను, మతం పేరుతో వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులకు కడపుకోత మిగుల్చుతుందని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అంతకు ముందు ఆ మగాడ్ని చంపేయండంటూ సంచలన కామెంట్స్ చేసింది పూనమ్. భరించలేని పరిస్థితి వస్తే కత్తిపట్టడంలో తప్పులేదని గురుగోవింద్‌ చెప్పిన సూక్తులను ఉటంకిస్తూ.. ‘వేధించే మగాళ్లు సింహాలైతే.. మనం గర్జించే సివంగులం, ఆడపులులం.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ పూనమ్‌లో ఇంత ఆవేదన ఎందుకు? ఆమెలో ఈ కన్నీరుకు కారణం ఏంటి? అది తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9. ఆ ప్రశ్నలు అడిగీ అడగగానే.. ఊహించని రీతిలో ఇంకాస్త భావోద్వేగంగా మాట్లాడారు. అంతకంతకూ ఘాటు పెంచారు. ప్రత్యేకించి ప్రీతిని ఉదాహరణ చూపించి.. ఆడవాళ్లు ఆడపుల్లల్లా, సివంగుల్లా మారాలని ‘రాజకీయ స్వార్థం కోసం మహిళల్ని తొక్కేస్తున్నారు. అలా బలవుతున్న వాళ్లలో నేనూ ఒకదాన్ని. రాజకీయ అండదండలుంటేనే పట్టించుకుంటారా?. తెలంగాణను తెచ్చింది తెలంగాణ బిడ్డల కోసమే కాదా? మీ బిడ్డలు మాత్రమే ఎదగాలంటే ఎలా? చేనేతకు ప్రోత్సాహం గురించి సీఎం మాట్లాడతారు.. దానిపై ఉద్యమం చేస్తున్న నేను మాట్లాడాలంటే టైమ్ ఇవ్వరు. ప్రీతి, దిశ లాంటి ఘటనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక, తెలంగాణ వాళ్లను వదిలేస్తారా. మేం తెలంగాణ కాదా.. మేం తెలంగాణ బిడ్డలం కాదా?. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే.. మీకు ఇష్టమైన అమ్మాయిలు, ముంబై అమ్మాయిలకే అవకాశాలా?. ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ముందు మిమ్మల్ని సతాయించిన మనిషిని చంపేయండి. వేధింపులతో భరించలేని పరిస్థితి వస్తే కత్తిపట్టమని గురుగోవింద్ చెప్పారు. వేధించే మగవాళ్లు సింహాల్లా భావిస్తే.. తిరగబడే సివంగులం, ఆడపులలం మనం.. గుర్తుంచుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఓవైపు గవర్నర్‌.. మరోవైపు పూనమ్‌కౌర్. మొత్తం తెలంగాణలో స్థితిగతుల గురించి చెబుతూ మహిళా దినోత్సవ వేదికను వేడెక్కించారు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..