Telangana News: కన్న కొడుకులా పెంచుకున్నారు.. కట్ చేస్తే.. తమ పొలంలోనే..
జాతులు వేరైనా బంధాలకు, అనుబంధాలకు కొందరు అతీతంగా వ్యవహరిస్తుంటారు. తాము పెంచుకునే సాధు జంతువులతో వారికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన, తమ సొంత కొడుకులా పెంచుకున్న ఓ శునకానికి పాడే కట్టి అంత్యక్రియలు నిర్వహించారు ఈ దంపతులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నివాసముండే భద్రం – శారద దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. తమకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో కొడుకు లేని లోటును తీర్చుకునేందుకు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆ శునకానికి డెన్ని అని నామకరణం కూడా చేశారు. డెన్నీని వారి ఇద్దరు కుమార్తెలు ముద్దుగా బుడ్డి అని పిలుచుకునేవారు. ఐదేళ్లుగా ఆ శునకాన్ని చంటి పాప వలె చూసుకుంటున్నారు. వారి కుమార్తెలు కూడా ఆ శునకాన్ని తమ తమ్ముడు వలె లాలిస్తూ ఉంటారు. దీంతో ఆ శునకానికి వారిపై ఎంతో ప్రేమ, వారికి కూడా ఆ శునకం అంటే ఎనలేని ఇష్టం ఏర్పడింది.
ఈ క్రమంలోనే డెన్నీ అలియాస్ బుడ్డి ప్రమాదం బారిన పడింది. ఇంటి ముందు రహదారిపై ఉండగా ట్రాక్టర్ డీ కొనడంతో డెన్ని మృతి చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డెన్ని మృతిని తట్టుకోలేని భద్రం కుమార్తెలు నిన్నటి నుండి ఆహారం కూడా తినకుండా విలపించడం చూస్తే ఆ శునకం పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా మనుషులు మరణిస్తే సాంప్రదాయపద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. పెంపుడు కుక్క కూడా తమ కుటుంబ సభ్యుడుగా భావించిన భద్రం కుటుంబం ఆ శునకానికి సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. పాడే కట్టి పసుపు కుంకుమ జల్లి తమ పొలంలోనే ఖననం చేశారు. డేన్నీని ఎప్పుడు తాము జంతువులా భావించలేదని కొడుకు లాగా చూసుకున్నామని భద్రం కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. డెన్ని తమను విడిచిపోవడం తీరని శోకాన్ని మిగిల్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. జాతులు వేరైనా ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఆ బంధం ఎంతో పటిష్టంగా ఉంటుంది అనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి