AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!

తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది 365 రోజులు కాదు.. కేవలం 122 రోజులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో 75 శాతానికి పైగా వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఉండే ఈ 122 రోజుల్లోనే నమోదవుతుంది. మిగిలిన 243 రోజుల తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ.. అన్నీ ఈ నాలుగు నెలలపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. 122 రోజుల్లో కురిసిన వర్షమే 365 రోజుల జీవితాన్ని నడిపిస్తోంది.

Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!
Telugu States Water
Siva Nagaraju
| Edited By: |

Updated on: Jul 31, 2026 | 6:30 AM

Share

ఈ వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. మరోవైపు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకచోట వరదలు.. ఇంకోచోట కరువు.. మరొకచోట వలసలు. ఒకే తెలుగు నేలపై మూడు కథలు కనిపిస్తున్నాయి. అసలు మనకు నీరు లేదా? లేక కురిసిన నీటిని భవిష్యత్తు కోసం దాచుకునే ప్రణాళిక లేదా? అనే విషయాన్ని చూస్తే..

ప్రాజెక్టులు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తే.. నీటి వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 44.60 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే ప్రాజెక్టు సామర్థ్యంలో కేవలం 21 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 137 టీఎంసీల నీరు ఉంది. అంటే 44 శాతం మేర నిల్వలు ఉన్నాయి.

మరోవైపు జూరాల ప్రాజెక్టు వరద నీటితో పూర్తిస్థాయికి చేరువలో ఉంది. తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయికి చేరుకుని గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. కానీ సోమశిల ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తిస్థాయి నిల్వకు చాలా దూరంలో ఉంది. 26.85 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోట ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండలేదు.

నీరు ఉందా?.. ప్రణాళిక ఉందా?

శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల, గండికోట ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిపినా కేవలం 632 టీఎంసీలే. కానీ గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో కొన్ని రోజుల్లోనే వందల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే.. ప్రకృతి మనకు నీటిని ఇవ్వడం లేదనేది సమస్య కాదు. ఇచ్చిన నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోలేకపోతున్నామనేదే అసలు సమస్య.

మనకు నీరు లేదనేది అబద్ధం.. నీటిని నిల్వ చేసుకునే సమయం లేదనేదే నిజం. అయితే ఈ నీటి కథలో మరో కోణం కూడా ఉంది. అదే.. వలసలు. నీరు అనేది కేవలం వ్యవసాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది ఒక ప్రాంతం ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే శక్తి కూడా. నీరు ఉంటే వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఉంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి ఉంటే వలసలు తగ్గుతాయి. నీరు లేని చోట పంట నష్టాలు, ఉపాధి సమస్యలు, చివరకు వలసలు కనిపిస్తాయి. అందుకే వరద, కరువు, వలస.. ఈ మూడు వేర్వేరు సమస్యలు కావు. ఒకే సమస్యకు మూడు రూపాలు..

ప్రకృతి పంపుతున్న హెచ్చరిక

దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న తీరూ ఆందోళన కలిగిస్తోంది. 2025లో దేశంలో 360 రోజుల పాటు తీవ్ర వాతావరణ ఘటనలు నమోదయ్యాయి. అంటే.. ఏడాదిలో దాదాపు ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట ప్రకృతి తన ప్రభావాన్ని చూపించింది. ఇదే కాలంలో 4,421 మంది ప్రాణాలు కోల్పోయారు. 1.74 కోట్ల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. 1.81 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ లెక్కలు కేవలం అంకెలు కావు. రానున్న రోజులకు ప్రకృతి పంపిస్తున్న హెచ్చరికలు.

ఆగస్టు.. అగ్నిపరీక్ష!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముందున్న అతిపెద్ద పరీక్ష ఆగస్టు నెల. వాతావరణ నిపుణులు ఆగస్టును వరదల నెలగా అభివర్ణిస్తుంటారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో ఈ నెలలోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే.. రానున్న 30 రోజులు కేవలం వాతావరణ శాఖకు మాత్రమే కాదు.. ప్రభుత్వాల నీటి నిర్వహణకు కూడా పరీక్షే.

ఒక్కసారి ఆలోచించండి. 365 రోజుల అవసరాలకు మనం ఆధారపడేది కేవలం 122 రోజుల వర్షాలపైనే. ఆ 122 రోజుల్లో కురిసిన ప్రతి చుక్కనూ భద్రపరచుకోలేకపోతే.. మిగిలిన 243 రోజులు కరువుతోనే ప్రయాణం తప్పదు. వరదలు ప్రకృతి సృష్టిస్తోంది.. కానీ కరువును మాత్రం మనమే సృష్టించుకుంటున్నాం. నీటిని దాచుకున్న రాష్ట్రాలు చరిత్రను సృష్టిస్తే.. నీటిని కోల్పోయిన ప్రాంతాలు వలసలను సృష్టిస్తాయి.

నీటిని దాచుకుంటేనే.. భవిష్యత్తు!

వరద.. కరువు.. వలస..! ఇవి మూడు పదాలు కావు. తెలుగు రాష్ట్రాల నీటి రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ప్రజల జీవితాలను ప్రతిబింబించే మూడు అద్దాలు. ఈ మూడు కథలకు ఒకే సమాధానం ఉంది. అదే.. నీటి నిర్వహణ. ఎందుకంటే.. మనకు నీటి కొరత లేదు. కురిసిన నీటిని భవిష్యత్తుకు అందించే ప్రణాళికలోనే అసలు కొరత ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us