Kukatpally: తల్లిదండ్రులు పనులకు వెళ్లారు.. స్కూల్‌కి సెలవని పాప ఇంట్లోనే ఉంది.. మధ్యాహ్నం వచ్చి చూడగా
స్కూల్‌కి సెలవు. అమ్మానాన్న ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. పదేళ్ల పాప సహస్ర ఇంట్లో ఒక్కతే ఉంది..! బాబుకు లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు.. మధ్యాహ్నం 12.30సమయంలో తండ్రి ఇంటికొచ్చాడు వచ్చేసరికి మంచం మీద.. మూడు కత్తిపోట్లతో నెత్తుటి మడుగులో కూతురు! పాపం సహస్ర..! ఇంత ఘోరమా! ఇంత అన్యాయమా! --సహస్రను చంపిందెవరు? దొంగతనమా..! కలహాలు.. కక్షలా? మరేదైనా ఘోరమా!

కూకట్‌పల్లిలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణంగా హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగీత్‌నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తల్లి ల్యాబ్ టెక్నీషియన్, తండ్రి బైక్ మెకానిక్. బాలిక బోయిన్‌పల్లి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని పాఠశాలకు పంపి ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో స్కూల్‌కి వెళ్లిన తనయుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తన బిడ్డ కత్తిపోట్లతో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా బాలికపై లైంగిక దాడికి ఓ యువకుడు యత్నించినట్లు తెలుస్తోంది. ఎదురుతిరిగిన బాలికను పొడిచి చంపినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. బాలిక ఒంటిపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగింది. యువకుడు ఇంట్లో నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




