AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar System: అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం చందమామ..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్ధలకు ఒకటే కామన్ పాయింట్. భూమి లాంటి భూమి ఈ విశ్వంలో మరెక్కడైనా ఉందా.? మరెక్కడైనా జీవరాశి ఉందా..? ఏలియన్స్ అంటూ ఉంటే అవి ఏ దశలో ఉన్నాయి..

Solar System: అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం చందమామ..
Nasa Solar System Exploration Stops At Moon
Murali Krishna
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 23, 2021 | 12:11 PM

Share

NASA, ISRO, CASA, CSA ASC, CNES ఇవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కొన్ని అంతరిక్ష పరిశోధనా సంస్ధలు.. ఈ సంస్ధలన్ని చేసే అనేక రకాల పరిశోధనల్లో ఒక కామన్ పాయింట్ భూమి లాంటి భూమి ఈ విశ్వంలో మరెక్కడైనా ఉందా.? మరెక్కడైనా జీవరాశి ఉందా..ఏలియన్స్ అంటూ ఉంటే అవి ఏ దశలో ఉన్నాయి..ఇవే ప్రధాన అంశాలుగా అనేక రోవర్లని, శాటిలైట్స్, స్పేస్ క్రాఫ్ట్ లని పంపిస్తున్నాయి. విశ్వాన్ని శోధించే ప్రయత్నం చేస్తున్నాయి. మన సౌర మండలం అవతల ఉన్న అనేక సోలార్ సిస్టమ్స్ ని కూడా అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి..అయితే తాజాగా ఈ సంస్ధలన్ని ఒక నిర్ణయానికొచ్చాయి..అదే చంద్రుడ్ని సమూలంగా స్కాన్ చేయాలని..చంద్రుడ్ని స్కాన్ చేస్తే ఈ ప్రశ్నలకి ఎలా సమాధానం దొరుకుతుంది అంటే, ఖచ్చితంగా దొరకుతుంది అన్నది ఈ సంస్ధలకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.

తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా మార్స్ మీదకు పర్సీవరెన్స్ రోవర్‌ని పంపింది. అంతకంటే ముందుకు కూడా పాత్ ఫైండర్, క్యూరియాసిటీ లాంటి అనేక రోవర్లని పంపించి మార్స్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే పనిలో ఉంది. అయితే మార్స్ చుట్టూ ఉంటే అట్మాస్ఫియర్ అందుకు అనుకూలంగా ఉంది కాబట్టి అది సాధ్యపడుతోంది. కానీ, వేరే గ్రహాల మీదకు ఈ తరహాలో రోవర్లు పంపించడం అంత ఆషామాషి విషయం కాదు. అక్కడ ఉంటే అట్మాస్ఫియర్ అందుకు ఏమాత్రం అనుకూలంగా ఉండదు.. ఆ గ్రహాల పరిధిలోకి వెళ్లిన మరుక్షణమే అవి బూడిద అయిపోవడమో…ముక్కచెక్కలు కావడమో జరిగిపోతుంది.

మన భూమి కూడా అలాంటిదే. మన భూమి మీదకు అంతరిక్షం నుంచి వేరొక రోవర్ కానీ, ల్యాండర్లు కానీ పంపండం చాలా తేలికైన విషయం కాదు.. ఒక వేళ ఏలియన్స్ అంటూ ఉండి అవి వేరే సౌర కుటుంబం నుంచో, విశ్వం లోని మరో పాలపుంత నుంచో రోవర్లుని మన భూమి మీదకి పంపించే ప్రయత్నం చేస్తే అవి మన భూమిని చేరడం కంటే ముందే కాలి బూడద అయ్యే పరిస్ధితి ఉంటుంది. మన భూమి చుట్టూ ఉన్న రక్షణ అలాంటిది.. అనేక రకాలైన ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాల నుంచి భూమిని రక్షిస్తున్న వ్యవస్ధ ఇది. మనకు తెలియకుండా కొన్ని కోట్ల ఆస్ట్రాయిడ్స్ అర్త్ అట్మాస్ఫియర్ లోకి చేరిన మరుక్షణమే కాలి బూడిత అయిపోతున్నాయి. అవన్నీ భూమిని ఢీకొని ఉంటే భూమి మీద జీవ రాశి ఎన్నడో నాశనం అయిపోయి ఉండేది.

2003 ఫిబ్రవరి 1వ తేదీన కల్పనా చావ్లా తో పాటు ఆరుగురు వ్యోమగాములు కొలంబియా అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వస్తున్న క్రమంలో ఎంత దారుణంగా చనిపోయారో ఈతరం వాళ్లందరికీ తెలుసున్న విషయమే. ఈ ప్రమాదానికి కారణం వారి ఉపయోగించిన కొలంబియా స్పేస్ షటిల్‌పై భాగంలో ఉండే ఒక పెంకు లాంటి పదార్ధం ఊడిపోవడం. సిరమిక్ టైల్ లాంటి ఈ పెంకు ఊడిపోవడం మూలంగా కొలంబియా స్పేస్ షటిల్ భూమికి చేరకునే క్రమంలోనే కాలి బూడిద అయిపోయింది. భూమి చుట్టూ ఉన్న అట్మాస్పియర్ వల్లే ఇలా జరిగింది.

ఇక చంద్రుడి విషయానికొస్తే, చంద్రుడి చుట్టూ ఇలాంటి వాతావరణం ఏమీ లేదు. ఏ గ్రహ శకలమైనా, లేక రోవర్లయినా నేరుగా చంద్రుడి మీద పడే అవకాశం ఉంది. అంతే కాదు, ఎలాంటి వాతావరణం లేని చంద్రుడి మీద వాటి గుర్తులు అలాగే ఉండిపోతాయి.. జూలై 20, 1969న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద మొదటి సారిగి పాదం మోపిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ తర్వాత నాసాతో పాటుగా మరే దేశం చంద్రుడి మీదకు మనుషుల్ని పంపిచే ప్రయత్నం చేయలేదు. ఒక వేళ ఎవరైనా మళ్లీ అదే ప్రదేశంలో చంద్రుడి మీదకి ల్యాండ్ అయితే, నీల్ పాద ముద్రల్ని ఇప్పటికీ చూడడానికి అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాలైనా అవి చెక్కు చెదకుండా అలాగే అవి ఉండిపోవడానికి కారణం చంద్రుడి మీద ఎలాంటి వాతావరణం లేక పోవడమే. సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా సంస్ధలన్నీ చంద్రుడ్ని స్కాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి.

బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం భూమి తోపాటుగా మన సౌర కుటుంబంలో ఉన్న ఇతర గ్రహాలు, వాటి ఉప గ్రహాలు ఏర్పడి 13.8 బిలియన్ సంవత్సరాలు అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా ఇతర పాల పుంతల నుంచో, ఇతర సౌర కుటుంబాల నుంచో ఎవరైనా ఏలియన్స్ ఏదైనా రోవర్లు కానీ, మరే ఇతర పరికరాల్ని కానీ మన సౌర కుటుంబానికి పంపించే ప్రయత్నం చేస్తే ఇతర గ్రహాల కంటే అవి చంద్రుడి మీద మాత్రం చాలా సేఫ్ గా ల్యాండ్ అయి ఉంటాయి. వాటి ఆనవాళ్లు ఇన్ని కోట్ల సంవత్సరాలైనా చెక్కు చెదకుండా అక్కడ మిగిలే ఉంటాయి. కాబట్టి, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వెళ్లడానికి అవకాశం ఉన్న చంద్రుడ్ని పూర్తిగా అంగుళం అంగుళం శోధిస్తే వాటిని గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది అన్నది తాజా థియరీ. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదే కనుక విజయవంతం అయితే మన చంద్రుడే విశ్వానికి అవతల ఉన్న అనేక ఖగోళ రహస్యాల్ని మనకి భద్రంగా చెప్పే అవకాశం ఉంది.

—  మురళీ కృష్ట, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టీవీ 9.