AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thunderstorms Effect: పిడుగుపాటును తప్పించుకోవచ్చా…? ఆసక్తికరమైన విషయాలు చదివితే షాకే !

ఆకాశంలో హఠాత్తుగా ఉరుములు మెరవడం, పిడుగులు పడడం మనం చూస్తుంటాం. వేసవిలో అయితే మరింత ఎక్కువగా ఇవి కనిపిస్తూ వుంటాయి. వర్షాలెలా పడతాయో తెలుసు.. మరి పిడుగులు ఎలా వస్తాయి?

Thunderstorms Effect: పిడుగుపాటును తప్పించుకోవచ్చా...? ఆసక్తికరమైన విషయాలు చదివితే షాకే !
Thunderstorms And Vajrapath Mobile App
Rajesh Sharma
|

Updated on: Apr 13, 2021 | 6:09 PM

Share

Thunderstorms Effect Interesting Facts: ఆకాశంలో హఠాత్తుగా ఉరుములు మెరవడం, పిడుగులు పడడం మనం చూస్తుంటాం. వేసవిలో అయితే మరింత ఎక్కువగా ఇవి కనిపిస్తూ వుంటాయి. వర్షాలెలా పడతాయో తెలుసు.. మరి పిడుగులు ఎలా వస్తాయి? పిడుగులు పడినపుడు వాటి నుంచి తప్పించుకునే చాన్స్ వుందా? ముందు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల నుంచి మనల్ని మన రక్షించుకోవచ్చా? ఈ చర్చ ఇపుడు జోరందుకుంది. తెలంగాణ (TELANGANA)లోని యాదాద్రి భువనగిరి (YADADRI BHUVANAGIRI) జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని లింగోజిగూడెంలో పిడుగుపడి రైతు దంపతులు దుర్మరణం చెందారు. వర్షం పడుతుండగా పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో దంపతులు అక్కడికక్కడే మరణించారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు మామిడి చెట్టుకింద నిలబడగా పిడుగుపడి మృతిచెందాడు. ఆత్మకూరు (ఎం)లో పిడుగుపడటంతో ధనబోయిన యాదయ్య చనిపోయాడు. ఇలా ఒకరోజే ఆరుగురు చనిపోవడంతో పిడుగుపడే సమాచారం ముందుగా తెలిస్తే వారు ప్రాణాలతో బయట పడే వారు కదా అనే వాదన తెరపైకి వస్తోంది.

వేసవి (SUMMER)లోనే ఎక్కువగా పిడుగులు ఎందుకు పడతాయి? అందుకు అధిక ఉష్ణోగ్రతలే కారణమని చెబుతారు. ఉష్ణోగ్రతలు అధికంగా వున్నప్పుడు నీరు ఎక్కువగా ఆవిరి అవుతుంది. ఆకాశంలో 25 వేల అడుగుల ఎత్తు వరకు ఈ ఆవిరి వెళ్ళిపోతుంది. దాంతో దట్టమైన క్యూములోనింబస్ (CUMULONIMBUS) మేఘాలు ఏర్పడతాయి. ఎండ వేడికి తేలికైన ధనావేశ మేఘాలు పైకి వెళ్ళి, బరువుగా వుండే రుణావేశి (ఎలక్ట్రాన్) మేఘాలు బాగా కిందికి వస్తాయి. దాంతో పిడుగులకు ఆస్కారమేర్పడుతుంది. ఒక్కో పిడుగులో 30 కోట్ల ఓల్టుల విద్యుత్ (ELECTRICITY)‌ ఉత్పత్తి అవుతుందని అంఛనా. ఈ స్థాయిలో విద్యుత్ మనిషిపై పడితే అక్కడిక్కడే బూడిదైపోక తప్పదు. అందుకే ఎత్తైన టవర్లు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరిస్తూ వుంటారు. ఆకాశంలో పైకెగసిన దుమ్ము, ధూళి, సూర్యుడి ఉష్ణతాపం వల్ల ఆవిరి అవుతుంది. నీరు వాయు సమ్మిళితమై మబ్బుగా తయారవుతుంది. పైకి వెళ్లిన నీటి ఆవిరి సుమారు -15 నుంచి -20 సెల్సియస్‌ డిగ్రీల వరకు చల్లబడటం (SUPER COLD‌)తో అవి మంచు కణాలుగా మారతాయి. వాటి బరువు వల్ల కిందికి దిగడం మొదలు పెడతాయి. ఆ దారిలో పైకి వచ్చే వేడి గాలి, చల్లబడి జారే మంచు కణాలు తాకిడికి గురవుతాయి. అప్పుడే ధన, ఋణ ఆవేశపు అయాన్లుగా విడిపోతాయి. చల్లని పైకి వెళ్ళే చిన్ని మంచు కణాలు ధన ఆవేశాన్ని పొందగా, కిందికి వచ్చే బరువైన మంచు ఋణ ఆవేశాన్ని పొందుతాయి. దీనిని ఉష్ణ విద్యుదావేశపు విభాగ ప్రక్రియ (థెర్మియానిక్‌ డివిజన్‌) అంటూ వుంటాం. ఇది ఒక సెంటీమీటరుకు 30 కిలో ఓల్టుల కన్నా అధిక శక్తితో తయారైతే విద్యుత్‌ ఆవేశ ప్రవాహం మనకు కనపడుతుంది. మెరుపు వచ్చి ఒత్తిడికి గురైన గాలి చల్ల బడడంలో భాగంగా విడుదల చేసిన శక్తి మనకి ధ్వని తరంగంగా (షియర్‌డ్‌ సౌండ్‌ వేవ్‌) వినబడుతుంది. ఆ పెద్ద శబ్దాన్నే మనం ఉరుము అంటాము. ఈ ఆవేశం భూమిపై ఉపరితలాన్ని తాకితే దాన్ని పిడుగు అని చెబుతాం.

ఎన్ని సార్లు…?

ఈ భూమి మీద ఏడాదికి సుమారు 140 కోట్ల సార్లు పిడుగుపాటు ప్రభావం ఉంటోందని అంచనా. భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా (సుమారు 70 శాతం), మిగతా భాగాల్లో తక్కువగా ఉంటోంది. అధిక ఉష్ణోగ్రతలే దానికి కారణం. భూమిపై ఎత్తు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పిడుగులు పడతాయి. కానీ అలాగే జరగాలని రూలేమి లేదు. రెండు ఋణ ఆవేశపూరిత మబ్బులు దగ్గరగా వచ్చినట్లైతే, వాటి మధ్య ఆవేశ వ్యతిరేక ప్రభావం వల్ల నేరుగా పిడుగు భూమిని చేరుతోంది. విద్యుదావేశ ప్రవాహం దానికి ముందు ఎదురయ్యే అంతరాయాన్ని అంచనా వేసుకుంటూ తక్కువ అంతరాయం దిశగా ప్రయాణం చేస్తోంది. ఇది సుమారు 25 కిలో మీటర్లు వ్యాపించి, మబ్బు కనబడని ప్రాంతంలో కూడా పిడుగు పడే అవకాశం ఉంది. మెరుపు వేగం సుమారు కాంతి వేగంతో సమానంగా తీసుకుంటే, ఉరుము వేగం ధ్వని వేగానికి సమానంగా ఉంటోంది. మెరుపు కనబడ్డ సుమారు మూడు సెకన్లకు ఉరుము వినబడుతోంది. దాదాపుగా ఒక కిలో మీటరు దూరంలో పిడుగు పడిందని తెలుస్తోంది. పిడుగు శక్తి బట్టి గోళం వ్యాసం మారుతుంది.

ముప్పు తప్పించుకోవడం ఎలా?

పిడుగుపాటు ఎత్తైన భవనాలు, విద్యుత్‌ వాహక తీగలకు, పరికరాలకు ప్రమాదం కలిగిస్తుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి భవనాలపై లైటింగ్‌ అరెస్టర్‌లని ఏర్పాటు చేస్తారు. ఇవి మూడు రకాలు. భవనం వెలుపల ఎక్కువ శక్తి కలవి. భవనం లోపల తక్కువ శక్తి రక్షణని ఇచ్చేవి. విలువైన పరికరాలను కాపాడేవి మూడో రకం. ఎత్తైన లోహపు గొట్టాలను భవనాలపై పెడితే, వాటిని ఫ్రాంక్లిన్‌ రాడ్లు అంటాం. వాటి ఎత్తునుంచి సుమారు 30 డిగ్రీల కోణం వరకు అవి రక్షణనిచ్చే వీలుంది. లోహపు తీగ వలని భవనంపై అమరుస్తారు. దానిని ఫారడే రక్షణ కవచం అంటాం. భవనానికి పిడుగు తాకకుండా రాడ్లు, తీగల సాయంతో తయారు చేసిన వలని కేటినరీ లైట్నింగ్‌ అరెస్టర్‌ అంటాం. పిడుగుకి కొంత దూరం వరకూ ఎదురెళ్ళి దానిని తరిమి కొట్టి భూమిలో నిక్షిప్తం చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా ఇప్పుడు వచ్చాయి. వాటిని ఎర్లీ స్ట్రీమర్‌ లైటింగ్‌ అరెస్టర్‌లు అంటాం. ఇంటి వెలుపల ఇంటికి 100 కిలో యాంపియర్ల పైబడ్డ విద్యుత్‌ ప్రవాహం నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లోకి వచ్చే విద్యుత్‌ తీగలలోని పిడుగు తరంగాల నుంచి రక్షణ కలిపించడానికి సర్జ్‌ ప్రొటెక్షన్‌ డివైసెస్‌ (ఎస్‌పిడి) ఏర్పాటు చేస్తాం. సర్జ్‌ సప్రసర్‌ అనే పరికరం 12 కిలో యాంపియర్ల పైబడ్డ విద్యుత్‌ ప్రవాహం నుంచి రక్షణ కల్పిస్తాయి.

మనషుల సంగతేంటి…?

వర్షం పడ్డటప్పుడు ఎక్కువ మంది చెట్ల కిందకు వెళతారు. మనుషులకు రక్షణ పిడుగు రక్షకాలున్న భవనాలే కానీ చెట్లు ఎంత మాత్ర కావు. పిడుగులు పడే సమయంలో ఆరు బయటకు వెళ్లవద్దు. చెట్ల కింద ఉండడం క్షేమం కాదు. చెట్లు పిడుగుని ఆకర్షిస్తాయి. తప్పని సరై ఉండాల్సి వస్తే కాళ్లు ముడుచుకుని కూర్చోవాలి. ఇంట్లో గోడలకు ఆనుకుని ఉండడం మంచిది కాదు. మనిషి, నాలుగు కాళ్ళ జంతువైన ఆవులాంటి జంతువు పక్క పక్కనే ఉంటే నాలుగు కాళ్ళ జంతువుకు ఎక్కువ ప్రమాదం. వజ్రపథ్‌ ద్వారా పిడుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకోవచ్చు. వాటికి లైట్‌నింగ్‌ అరెస్టర్లతో చెక్‌ పెట్టవచ్చు. పిడుకుపాటు నుంచి రక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి వుంటుంది. ఎత్తయిన నిర్మాణాలు, పెద్దపెద్ద కట్టడాలు పిడుగుబారిన పడకుండా లైట్‌నింగ్‌ అరెస్టర్‌లు ఏర్పాటు విద్యుత్‌ ఉపకేంద్రాల వద్ద, ఎత్తయిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల వద్ద ఏర్పాటు చేసుకోవాలి. పిడుగు పడే సమయంలో పిడుగును ఆకర్షించకుండా దాని దిశను మార్చేందుకు లైటినింగ్ అరెస్టర్లు ఉపయోగపడతాయి.

పిడుగుపాట్లపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) ఎస్సెమ్మెస్ (SMS)‌లతో హెచ్చిరికలు చేస్తోంది. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో వుంది. అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్కు (EARTH NETWORK), ఇస్రో (ISRO) సహకారాన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఎర్త్‌ నెట్‌వర్కు ద్వారా సెన్సార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందో ఈ సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చు. 30, 40 నిమిషాల ముందుగానే అంచనా వేసే వీలుంది. మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేయవచ్చు. ఈ విధానం ద్వారాలో వజ్రపథ్ (VAJRAPATH)‌ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. వజ్రపథ్‌ను ఏపీ ప్రభుత్వం (AP GOVERNMENT) అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ యాప్‌ ద్వారా పిడుగు మనకు ఎంత దూరంలో పడుతుందో తెలిసి పోతుంది. వజ్రపథ్ యాప్‌లో నాలుగు రంగుల వలయాలు ఏర్పాటు చేశారు. ఎరుపు వలయం (RED ZONE) అంటే డేంజర్ జోన్ (DANGER ZONE) అన్నమాట. ఈ వలయంలో వస్తుందని హెచ్చరిక జారీ అయితే.. ఆ ఏరియాలో సుమారు 8 కిలో మీటర్ల పరిధిలో పిడుగు పడుతుందని అర్థం. ఆరెంజ్‌ వలయం (ORANGE ZONE) వస్తే ఈ యాప్‌ వినియోగించేవారికి 8 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పిడుగులు పడతాయని అర్థం. దీంతో ప్రమాదం కాస్త తక్కువ. పసుపు వలయం (YELLOW ZONE) వస్తే 16 నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పిడుగులు పడే అవకాశం. ఇది తక్కువ ప్రమాదకర ప్రాంతం కింద లెక్క. నీలం వలయం (BLUE ZONE) వస్తే గనుక పిడుగులు పడే అవకాశం ఏమాత్రం లేనట్లుగా భావించాల్సి వుంటుంది.

ALSO READ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టం. ఫలితాన్ని తేల్చేవి ఆ రెండు జిల్లాలే!

ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం

ALSO READ: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?