AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Space Travel: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

అరవై ఏళ్ళ క్రితమే అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యమని నిరూపించాడు మానవుడు. అంతరిక్షమంటే అదే అద్బుతం.. అందులోకి ప్రయాణించడం అసాధ్యమన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ..

First Space Travel: మానవుని తొలి అంతరిక్ష యాత్రకు 60 ఏళ్ళు.. ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
Uri Gagarin, Space Travel
Rajesh Sharma
|

Updated on: Apr 13, 2021 | 4:06 PM

Share

First Space Travel by Humans: అరవై ఏళ్ళ క్రితమే అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యమని నిరూపించాడు మానవుడు. అంతరిక్షమంటే అదే అద్బుతం.. అందులోకి ప్రయాణించడం అసాధ్యమన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. శాస్త్ర సాంకేతిక రంగ ప్రయోగాలతో మానవుడు దేన్నైనా సాధించగలడని నిరూపించిన అపురూప ఘట్టానికి అరవై ఏళ్ళు పూర్తయ్యాయి. ఎస్.. అంతరిక్షంలోనికి మానవుడు ప్రయాణం చేసి 2021 ఏప్రిల్ 12వ తేదీతో షష్టి పూర్తి అయ్యింది. 1961 ఏప్రిల్ 12వ తేదీన ఆనాటి యుఎస్ఎస్ఆర్ (USSR).. ఇప్పటి రష్యా (RUSSIA)కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ URI GAGARIN) అంతరిక్ష యానం (SPACE TRAVEL) చేసి.. అంతరిక్ష యాత్ర చేసిన తొలి మనిషిగా చరిత్ర సృష్టించాడు. వోస్తోక్ వన్ (VOSTOK-1) వ్యోమ నౌక (SPACE SHIP)లో యూరీ గగారిన్ అంతరిక్ష యానానికి విజయవంతంగా వెళ్ళి వచ్చాడు. సుమారు 108 నిమిషాల పాటు ఆయన అంతరిక్షం(SPACE)లో గడిపాడు. ఈ క్రమంలో ఒకసారి భూమి (EARTH)ని ఓ చుట్టు చుట్టి వచ్చాడు. ఈ ఘనత సాధించినందుకు గుర్తుగా.. ఏప్రిల్ 12వ తేదీని అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.

1957 అక్టోబరులో ‘స్పుత్నిక్‌’ (SPUTNIK) రూపంలో ప్రపంచ తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన సోవియట్‌ యూనియన్‌ (రష్యా) అదే ఊపులో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అనేక ఎదురు దెబ్బలు ఎదురైనా.. వెన్ను చూపకుండా రాకెట్ ప్రయోగాలను కొనసాగించింది రష్యా. అదే క్రమంలో 1961లో అంతరిక్ష యానానికి ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు 1960లో అనేక రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. 1960 అక్టోబర్ నెలలో రాకెట్ లాంచ్ ప్యాడ్ (ROCKET LAUNCH PAD) వద్ద జరిగిన విస్ఫోటంలో ఏకంగా 126 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తర్వాత కేవలం ఆరు నెలల కాలంలోనే రష్యా తొలి అంతరిక్షంలోకి మానవున్ని పంపడంలో విజయం సాధించింది. వోస్తోక్‌-1 వ్యోమనౌకలో 108 నిమిషాల పాటు యూరి గగారిన్‌ అంతరిక్ష యాత్ర చేశాడు. అయితే గగారిన్ ప్రయాణించబోయే వోస్తోక్ వన్ వ్యోమనౌక తలుపులు మూసుకోకపోవడంతో ప్రయోగానికి ముందు రష్యాన్ శాస్త్రవేత్తలు విపరీతంగా టెన్షన్‌కు గురయ్యారు. అదే సమయంలో రోదసిలోకి చేరుకున్న తర్వాత వోస్తోక్ వన్ ఇంజిన్‌ దెబ్బతిన్నది. వ్యోమనౌక తనంతట తానుగా వారం రోజుల్లో తిరిగి భూమిని చేరేలా కక్ష్యను ముందుగా ఎంపిక చేసుకున్నారు. కానీ తిరుగు ప్రయాణంలో ఇంధనం తగ్గిపోవడంతో స్పేస్ సైంటిస్టులు తెగ టెన్షన్ పడ్డారు. దాంతో రీ ఎంట్రీ మార్గాన్ని ఎంచుకున్నారు. రీఎంట్రీ మార్గంలో వ్యోమనౌక బొంగరంలా తిరిగిపోయింది. ఆ సమయంలో.. సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తిని గగారిన్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో తన కళ్ళు మసకబారాయని యూరీ గగారిన్ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వ్యోమగాములు మతిస్థిమితాన్ని కోల్పోతారని శాస్త్రవేత్తలు తొలుత భయపడ్డారు. కానీ గగారిన్ విషయంలో అలా జరక్క పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి కూల పరిస్థితులు ఎదురైతే సరిదిద్దేందుకు వోస్తోక్ వన్‌లో ఆటోమేటిక్ నియంత్రణ వ్యవస్థను ఇమిడ్చారు.

మృదువుగా వ్యోమనౌకను నేలపై దించే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాంకేతికత అప్పటికింకా అభివృద్ధి కాలేదు. అందువల్ల కొంత ఎత్తు నుంచే వోస్తోక్‌ వన్ నుంచి గగారిన్‌ కిందకు దూకి, పారాచూట్‌ సాయంతో సాఫీగా నేలపై కాలుమోపేలా వ్యూహరచన చేశారు ఇంజినీర్లు. అయితే ప్రధాన పారాచూట్‌తోపాటు ప్రత్యామ్నాయ పారాచూట్‌ కూడా పొరపాటున విచ్చుకోవడంతో ల్యాండింగ్‌ ప్రక్రియ కష్టతరమైంది. అయినా సారాతోవ్‌ ప్రాంతంలో వోల్గా నది పక్కన సురక్షితంగా దిగగలిగారు గగారిన్‌. తొలి అంతరిక్ష యానం చేసి.. సురక్షితంగా భూమ్మీదికి తిరిగి వచ్చిన యూరీ గగారిన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే తన అంతరిక్ష యానం చేసిన ఏడేళ్ళ తర్వాత యూరీ గగారిన్ ఓ విమాన ప్రమాదంలో మరణించడం విషాదం. 1968 మార్చి 27న చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా అది కూలిపోవడంతో గగారిన్ దుర్మరణం పాలయ్యారు.

వ్యోమగామి శిక్షణ పొందిన 20 మంది వైమానిక దళ పైలట్లలో గగారిన్‌ ఒక్కరే అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యాడు. ఏ అంశాన్నైనా ఇట్టే ఆకళింపు చేసుకునే నైపుణ్యం, చెక్కుచెదరని చిరునవ్వు, ధైర్యం కలగలసిన గగారిన్‌‌కు అంతరిక్ష యానం చేసే నాటికి 27 ఏడేళ్ళు. అంతరిక్ష యాత్రకు రెండు రోజుల ముందు తన భార్య వాలంటీనాకు లేఖ రాసిన గగారిన్‌ తొలి రోదసి యాత్రకు ఎంపిక కావడం పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. ఈ యాత్రలో తాను మరణిస్తే విషాదంలోకి జారిపోవద్దని భార్యను కోరాడు గగారిన్. అయితే ఈ లేఖను గగారిన్‌ మరణానంతరమే ఆయన భార్యకు అందించారు రష్యాన్ అధికారులు. ‘‘ దూరంగా ఉన్న ప్రియమైన భూమి మీద మబ్బులను, వాటి మెరుపుల నీడలను చూశాను… నీరు నల్లటి, చిన్న మిణుకుమనే చుక్కలా కనిపించింది.. క్షితిజాన్ని చూసినప్పుడు లేతరంగు భూమి ఉపరితలానికీ, ఆకాశపు పూర్తి నిఖార్సైన నల్లరంగుకి మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించింది.. భూమి విభిన్నమైన రంగులను చూసి ఆస్వాదించాను.. దాన్ని లేత నీలం ప్రభామండలం చుట్టివుంటుంది.. అది క్రమంగా నల్లబడుతూ, వైఢూర్య వర్ణంలోకి, గాఢమైన నీలం రంగులోకి, బొగ్గులా నల్లటి నలుపులోకి మారుతూ ఉంటుంది’’ అని తన అంతరిక్ష యానం గురించి యూరీ గగారిన్ రాసుకున్నాడు.

ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం