Google Maps: ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..
గూగుల్ మ్యాప్స్ వాడాలంటే ఇంటర్నెట్ ఉండాలనే చాలామంది అనుకుంటారు. కానీ లేకపోయినా వాడవచ్చు. కానీ వైఫై కనెక్షన్ ఉన్నప్పుడే ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్ జీపీఎస్ ద్వారా మ్యాప్స్ పనిచేస్తాయి. అదెలానో ఇందులో చూడండి.

Offline Google Maps: ఎవరైనా మనకు తెలియని ప్లేస్‌కు వెళ్లాలంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తాము. ఆ డైరెక్షన్లను ఫాలో అవుతూ వెళ్లిపోతుంటాము. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ తప్పుగా కూడా చూపించొచ్చు. వెంటనే ఎక్కడికైనా వెళ్లిపోవచ్చనే భావనతో మ్యాప్స్ పెట్టుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడం, మధ్యలో డేటా అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొన్నిచోట్ల ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలను మనలో చాలామంది ఎదుర్కొనే ఉండి ఉంటారు. ఈ సమస్యలకు ఒక పరిష్కారం ఉంది. అదే ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్‌లో వాడొచ్చు. ఈ ఫీచర్ ఉందని చాలామందికి తెలిసినా వాడరు. ఇంతకు అదెలానో ఇందులో చూద్దాం.
ఇంటర్నెట్ లేకపోయినా ఎలా వాడాలంటే..?
-గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి
-అక్కడ క్రింద ఆఫ్‌లైన్ మ్యాప్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
-ఆ తర్వాత ‘సూస్ యువర్ ఓన్ మ్యాప్’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని జూమ్ చేసి మీరు వెళ్లాలనుకునే ఏరియాను సెలక్ట్ చేసుకుని డౌన్‌లోడ్ అనే ట్యాబ్‌ను ఎంచుకోండి
-ఇప్పుడు మీ మొబైల్‌లో డేటా లేకపోయినా మ్యాప్ వర్క్ చేస్తుంది. కానీ మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్లేటప్పుడే దీనిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు వాడుకోవాలి..?
మీరు ఇంటర్నెట్ అందుబాటులోని లేని ప్రాంతాలు, మొబైల్ నెట్‌వర్క్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలనప్పుడు ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను వినియోగించుకోవాలి. మారుమూల గ్రామాలు, పర్వతాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, బేస్‌మెంట్ పార్కింగ్ వంటి ప్రాంతాల్లో వాడాలి. ఇక విదేశాలకు ప్రయాణించేటప్పుడు మొబైల్ డేటాకు అదనంగా రోమింగ్ ఛార్జీలు పడతాయి. ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగించుకుంటే ఆ బాధ ఉండదు.
ఫోన్ ఛార్జింగ్ ముఖ్యం
ఆఫ్‌లైన్ మ్యాప్స్ వాడేటప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆఫ్‌లైన్ మోడ్‌లో జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. మీ ఫోన్‌లో ఎస్డీ కార్డు ఉంటే డౌన్‌లోడ్ చేసుకున్న గూగుల్ మ్యాప్స్ ఆప్‌లైన్ డేటాను అక్కడ భద్రపరచండి. మీ ఫోన్‌ను ఓపెన్ ప్లేస్‌లో ఉంచండి. దీని వల్ల జీపీఎస్ బాగా పనిచేస్తుంది.




