AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ కార్ల మార్కెట్‌లో భారీ మార్పులు? ఆ వెహికల్స్ హవా స్టార్ట్ అవుతుందా

ఒకప్పుడు షోరూమ్‌ల చుట్టూ తిరిగితే భారీ ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి. డిస్కౌంట్ల కోసం ఎదురుచూసే కస్టమర్లకు ఇప్పుడు షాక్ తగులుతోంది. చిన్న కార్ల విభాగంలో అసలేం జరుగుతోంది? ఎందుకు కంపెనీలు తమ రాయితీలను కత్తెరిస్తున్నాయి? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

బడ్జెట్ కార్ల మార్కెట్‌లో భారీ మార్పులు? ఆ వెహికల్స్ హవా స్టార్ట్ అవుతుందా
Small Car Segment.jpg
Nikhil
|

Updated on: Jun 30, 2026 | 8:56 PM

Share

బడ్జెట్ కార్ల మార్కెట్‌లో కొన్నేళ్లుగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ రంగానికి ఇప్పుడు పండగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మకాలు పుంజుకోవడంతో కార్ల ధరలపై భారీ తగ్గింపులను కంపెనీలు నిలిపివేస్తున్నాయి. రాయితీలు లేకున్నా కస్టమర్లు క్యూ కడుతున్నారు. అసలు ఈ మార్కెట్ మార్పుకు కారణమైన ఆ కీలక నిర్ణయం ఏమిటి?

కొంతకాలంగా కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు ఎవరూ ఊహించని మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు వినియోగదారులను ఆకర్షించడానికి సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ పోటీ పడేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ఎంట్రీ లెవల్ మరియు చిన్న కార్ల విభాగంలో డిమాండ్ ఊహించని స్థాయిలో పెరగడంతో, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ ఆఫర్లను భారీగా తగ్గించాయి. దాదాపు ఐదేళ్ల పాటు ఈ విభాగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొన్నప్పటికీ, సెప్టెంబర్ 2025లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఈ మార్కెట్‌కు సరికొత్త ఊపిరి పోసింది.

డిస్కౌంట్ల కోతలో దిగ్గజాలు

ప్రస్తుతం మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ సంస్థలు తమ పాపులర్ మోడళ్లపై డిస్కౌంట్లను గణనీయంగా తగ్గించాయి. గత మే నెలతో పోలిస్తే, జూన్ నెలలో మారుతి తన ప్రముఖ మోడళ్లయిన వ్యాగన్ ఆర్, బాలెనో వంటి కార్లపై ఇస్తున్న రాయితీలను భారీగా తగ్గించింది. ఇక టాటా మోటార్స్ పరిస్థితి చూస్తే, గతంలో టియాగో, పంచ్ వంటి కార్లపై ఇస్తున్న డిస్కౌంట్లను ఏకంగా రద్దు చేసింది.

అయినప్పటికీ, డీలర్ల వద్దకు వస్తున్న కస్టమర్ల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ముఖ్యంగా పెట్రోల్, సీఎన్జీ, ఈవీ వేరియంట్లకు భారీగా బుకింగ్స్ అందుతున్నాయి. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ధరలు పెరిగినప్పటికీ, అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉండటం ఆటో రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పుంజుకున్న విక్రయాలు..

ఒకప్పుడు ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్ వాటా 46 శాతం ఉండగా, అది క్రమంగా 23 శాతానికి పడిపోయింది. ప్రజలు ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపడం, ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణాలు. కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు మళ్లీ బడ్జెట్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్ల అమ్మకాలు ఏకంగా 146 శాతం పెరగడం ఈ విభాగం పుంజుకుందనడానికి నిదర్శనం.

కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ కార్ల అమ్మకాలు కూడా 31 శాతం వృద్ధితో 1,62,214 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీలకు ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే డిమాండ్ ఉండటంతో, ఇకపై రాయితీలు ఆశించడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఆటోమొబైల్ రంగానికి ఈ పరిణామాలు ఊరటనిస్తున్నాయి.

Follow Us