Digital Arrest Scam: కొత్త సైబర్ స్కాం.. డిజిటల్ అరెస్టు పేరుతో రూ. లక్షలు దోచేస్తున్నారు..

సైబర్ నేరగాళ్లు పోలీసు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులుగా నటిస్తూ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. దాని కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని, జైలు కు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్టు అంటే బాధితులు డబ్బు పంపే వరకూ వీడియో కాల్, స్కైప్ తదితర వాటిలో నేరగాళ్ల కు కనిపించాలి.

Digital Arrest Scam: కొత్త సైబర్ స్కాం.. డిజిటల్ అరెస్టు పేరుతో రూ. లక్షలు దోచేస్తున్నారు..
Digital Arrest Scam
Follow us

|

Updated on: Aug 01, 2024 | 5:47 PM

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొత్త పద్ధతులతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఒక మోసంపై ప్రజలకు అవగాహన కలిగేలోపు మరో కొత్త విధానంతో డబ్బులు లాగేస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగస్తులు, పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేవాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నష్టపోతున్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్టు స్కామ్ తెరపైకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు పోలీసు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులుగా నటిస్తూ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. దాని కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని, జైలు కు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్టు అంటే బాధితులు డబ్బు పంపే వరకూ వీడియో కాల్, స్కైప్ తదితర వాటిలో నేరగాళ్ల కు కనిపించాలి. వాటి నుంచి బయటకు వెళ్లడం కుదరదు.

పలు ఘటనలు..

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కి సంబంధించి తాజాగా ఒక కేసు వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన 40 ఏళ్ల డాక్టర్ సైబర్ నేరగాళ్లకు వలలో పడి రూ. 59.54 లక్షలు పోగొట్టుకున్నారు. ముందుగా ఆమెకు నేరగాళ్ల కాల్ చేసి తాము టెలికాం అధికారులమని పరిచయం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని భయపెట్టారు. అనంతరం ముంబైలోని తిలక్ నగర్ స్టేషన్‌ పోలీసు అధికారిని అంటూ ఓ వ్యక్తి లైన్ లోకి వచ్చాడు. అశ్లీల వీడియోలను షేర్ చేసినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, అరెస్ట్ వారెంట్ జారీ చేశామని ఆమెను భయపెట్టారు. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో ఆమె పేరు ముడిపడి ఉందని, ఆమెపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించబడిందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు కడితే వదిలివేస్తామని చెప్పి, జూలై 15, 16వ తేదీలలో ఆమె బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు లాగేశారు. డబ్బులు చెల్లించేవరకూ ఆమెను డిజిటల్ అరెస్టు లో ఉంచారు.

మరో కేసులో..

మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని నకిలీ అధికారి బెదిరించాడు. మాదక ద్రవ్యాల రవాణాలో అతడి పేరు ఉందని భయపెట్టాడు. పై తరహాలోనే 20 రోజుల వ్యవధిలో రూ.1.2 కోట్లు వసూలు చేశాడు. బాధితుడిని 24/7 ఆన్‌లైన్‌లో ఉండాలని ఆదేశించాడు.

డిజిటల్ స్కామ్ అంటే..

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ ను పార్సిల్ స్కామ్ అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో చట్టాన్ని అమలు చేసే ఉన్నత అధికారులుగా నేరగాళ్ల నటిస్తారు. ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. వారికి నిషేధిత వస్తువులతో కూడిన అనుమానాస్పద పార్శిల్ వచ్చిందని చెబుతారు. లేదా డ్రగ్స్ పార్సిల్ మీ పేరు మీద వచ్చిందని భయపెడతారు. బాధితుడికి ముందుగా ఫోన్ కాల్ చేస్తారు. అతడికి మరింత నమ్మించడానికి వీడియో కాల్స్ చేస్తారు. అసలైన అధికారుల వలే నటిస్తారు. యూనిఫాం, బ్యాడ్జీలతో పాటు కార్యాలయాన్ని కూడా సెట్టింగ్ వేస్తారు. వాటిని చూసి బాధితులు నిజమే అని నమ్ముతారు.

డబ్బుల డిమాండ్..

ఈ కేసుల నుంచి భయపడాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తారు. కొన్ని సార్లు ప్రభుత్వం నిబంధనలు అని చెప్పి డబ్బులు పంపాలని బెదిరిస్తారు. విచారణ, బెయిల్ తదితర వాటి కోసం డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. బాధితుడు సంకోచించినట్లయితే అరెస్టు పేరుతో భయపెడతారు. నేరం బయటపెట్టి పరువు తీస్తామని హెచ్చరిస్తారు.

అప్రమత్తంగా ఉండాలి..

అటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బెదిరింపు కాల్స్ వస్తే భయపడిపోకూడదు. మీకు అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే పోలీసులకు, మీ బ్యాంక్‌కు నివేదించండి. ఇది స్కామర్‌లను ట్రాక్ చేయడానికి, ఆపడానికి అధికారులకు సహాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..