రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ ఇబ్బందులు. అసలు ఖాళీ లేకుండా రోడ్డు నిండా కార్లు, టూవీలర్లు, వాటి మధ్య బస్సులు, ఇతర వాహనాలు..
అలా కాకుండా నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుంటుంది అనిపించని క్షణం ఉండదు. చాలాసార్లు ట్రాఫిక్ లో ఇలా అనిపిస్తుంది.
అలా వెళ్లాలనుకుంటే.. ఇదిగో ఈ ఎగిరే కారును కొనేసుకుంటే సరి. ఏంటి జోక్ అనుకొంటున్నారా.. కాదండి.. ఇది నిజం.
అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ హెక్సా ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్లా కనిపించే ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు.
ఇటీవల జపాన్లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి ఎత్తులోకి కారును తీసుకెళ్లి.. అటూ ఇటూ తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు.
ఈ ఎగిరే కారు 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్ని నేల మీదే కాదు.. నీటిలోనూ ల్యాండ్ చేయవచ్చని వివరించింది.
గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు.
ఇంతకీ దీని ధర 4 కోట్ల రూపాయలు. ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తే.. అప్పుడు అందిస్తారట. కాకపోతే దీనిలో ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు.