NISAR : భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో మరో మైలురాయి, నాసాతో కలిసి ఇస్రో స్పెషల్ ప్రాజెక్ట్ ‘నిసార్’
NISAR : అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు వేసింది ఇస్రో. భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో.. మరో మైలురాయిని చేరింది. నాసాతో కలిసి హై రిజల్యూషన్ చిత్రాలు తీసే..సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను విజయవంతంగా..
NISAR : అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు వేసింది ఇస్రో. భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో.. మరో మైలురాయిని చేరింది. నాసాతో కలిసి హై రిజల్యూషన్ చిత్రాలు తీసే..సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన ఎస్ బ్యాండ్ పేలోడ్‌కు మార్చి 4న..ఇస్రో చైర్మన్ కె.శివన్ వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి..అమెరికాలోని పాసడేనాలో ఉన్న నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి పంపారు. అక్కడ రెండు బ్యాండ్‌లను అనుసంధానం చేస్తారని ఇస్రో వర్గాలు చెప్పాయి. నాసా-ఇస్రో పేరు కలిసివచ్చేలా ఈ వ్యవస్థకు..నిసార్ అనే పేరు పెట్టారు.
నాసా-ఇస్రో నిర్వహిస్తున్న నిసార్ ప్రాజెక్టులో..భూపరిశీలన కోసం డ్యూయెల్ ఫ్రీక్వెన్సీలో భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. దీని కోసం వినియోగించే సార్‌ను ఇస్రో పూర్తి చేసింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి 2023లో ప్రయోగం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్.. ఇలా ఒక ఉపగ్రహంలో రెండు బ్యాండ్‌లు ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇది భూఉపరితల చిత్రాలను అత్యంత కచ్చితత్వంతో, అత్యధిక రిజల్యూషన్‌తో అందిస్తుంది. వాతావరణ మార్పులను, ప్రకృతి విపత్తులను అంచనా వేస్తుంది.
ఎల్, ఎస్ బ్యాండ్ ప్రీక్వెన్సీ ఉపగ్రహాల్లో ఉపయోగించేలా రూపొందించిన నిసార్..భూ పరిశోధనకు ఉపకరిస్తుంది. భూమిపై సెంటీమీటరు కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా ఈ పరికరం సాయంతో సులభంగా కొలవొచ్చని పేర్కొంది నాసా . నిసార్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు..2014 సెప్టెంబరులో నాసాతో ఒప్పందం చేసుకుంది ఇస్రో. సంయుక్త మిషన్ కోసం.. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను, సైన్స్ డేటా కోసం హైరేట్ కమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా సమకూరుస్తోంది. వాహకనౌక, ఎస్ బ్యాండ్ రాడార్, ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అవససరమైన సేవలను ఇస్రో సమకూరుస్తోంది. ఈ సంయుక్త మిషన్ ద్వారా ఆధునిక రాడార్ ఇమేజింగ్ ద్వారా..భూ ఉపరితల మార్పులకు కారణాలను కనుగొనవచ్చని భావిస్తున్నారు. ఇలాఉంటే, వరుస విజయాలతో దూసుకుపోతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ఇటీవలే పీఎస్‌ఎల్వీ సీ-51ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే.