PM Modi: డిజిటల్ యుగానికి సెమీకండక్టర్ ఆధారం.. రౌండ్ టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోడీ

డిజిటల్ యుగానికి సెమీకండక్టర్ ఆధారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం ప్రధాని మోడీ తన నివాసం 7 లోక్‌ మార్గ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఈ రంగంలోని అనుభవజ్ఞులతో మోడీ సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత మానవాళి ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలని..

PM Modi: డిజిటల్ యుగానికి సెమీకండక్టర్ ఆధారం.. రౌండ్ టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోడీ
Pm Modi
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 11, 2024 | 12:04 PM

డిజిటల్ యుగానికి సెమీకండక్టర్ ఆధారమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం ప్రధాని మోడీ తన నివాసం 7 లోక్‌ మార్గ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఈ రంగంలోని అనుభవజ్ఞులతో మోడీ సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత మానవాళి ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సెమీకండక్టర్ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదగడానికి భారత్‌కు అన్ని సామర్థ్యాలు ఉన్నాయని, భారతదేశంలో గరిష్ట సంఖ్యలో సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా తాము మా అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేస్తామని వెల్లడించారు. విధానాలను మెరుగుపరచడం ద్వారా తమ సహకారం ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.

ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం

సెమీకండక్టర్‌ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి సహకారాలు ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తోందో ఈ సమావేశంలో అర్థమవుతోందన్నారు. ప్రపంచం మొత్తం సెమీకండక్టర్ పరిశ్రమ దృష్టి ఇప్పుడు భారత్‌పైనే ఉందన్నారు. భారతదేశంలోని సెమీకండక్టర్ పరిశ్రమ కూడా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉందని, ఇప్పుడు చాలా గ్లోబల్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ముందుకొస్తున్నాయని గుర్తు చేశారు. ఇంతకు ముందు భారతదేశంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ లేవని, ఇప్పుడు గ్లోబల్‌ కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయన్నారు.

కొత్త ఆలోచనలు:

మీ ఆలోచనలు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. సెమీకండక్టర్లు ప్రతి అవసరానికి ఆధారం అవుతాయని, భారతదేశం ఇప్పుడు అటువంటి దిశలో పయనిస్తోందన్నారు. సామాజిక, డిజిటల్, మౌలిక సదుపాయాలు వంటి ప్రతి రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తాము కొత్త ఆలోచనలపై పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. భారతదేశంలో ప్రతిభకు కొదవలేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వారిని పరిశ్రమలను సమర్థంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలు సెమీకండక్టర్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సెమికాన్ ఇండియా 2024:

సెప్టెంబర్ 11న సెమీకండక్టర్ పరిశ్రమపై దృష్టి సారించిన గ్లోబల్ ఈవెంట్.. సెమికాన్ ఇండియా 2024ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మూడు రోజుల సదస్సు, “షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్” అనే థీమ్‌తో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 150 మంది స్పీకర్లతో సహా పరిశ్రమ నుండి కీలకమైన వ్యక్తులను ఒకచోట చేర్చుతుంది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారడానికి భారతదేశం నిబద్ధతను ఈ ఈవెంట్ హైలైట్ చేస్తుంది.

సెమీకండక్టర్ల తయారీలో స్వయం ప్రతిపత్తి కోసం భారతదేశం కృషి చేస్తోంది. 2021లో ప్రారంభించిన ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ (ISM), ఈ ప్రయత్నంలో కీలక భాగం. భారతదేశంలో చిప్‌ల తయారీ ప్లాంట్లను స్థాపించడానికి కంపెనీలను ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలను అందించడం దీని లక్ష్యం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి