VPN Safety: వీపీఎన్ వాడుతున్నారా ? సేఫ్‌గా లేకపోతే అంతే సంగతి!
ఇంటర్నెట్‌లో సేఫ్‌గా ఉండేందుకు వీపీఎన్ వాడాలని చాలాచోట్ల విని ఉంటారు. అయితే ఈ వీపీఎన్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అసలు వీపీఎన్ వాడొచ్చా? అది ఎంతవరకూ సేఫ్? ఒకవేళ వాడాలనుకుంటే ఎప్పుడు? ఎలా వాడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్’. ఇది ఇంటర్నెట్‌లో మన ఐడెంటిటీని, సర్వర్, ఐపీ అడ్రెస్‌ను దాచేస్తుంది. యూజర్ ఏ నెట్‌వర్క్‌తో, ఎక్కడి నుంచి ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తున్నాడో మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే సైబర్ నేరాల నుంచి తప్పించుకునేందుకు వీపీఎన్ బెస్ట్ టూల్. వీపీఎన్ వల్ల ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నాం అనే విషయం ఇతరులకు తెలియదు. యూజర్ల డేటా ఎన్‌క్రిప్ట్ అయి సేఫ్‌గా ఉంటుంది. పీసీలతో పాటు మొబైల్స్ లో కూడా వీపీఎన్ వాడొచ్చు. దీనికోసం చాలా సాఫ్ట్‌వేర్లు, యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
పెయిడ్ వీపీన్స్
అయితే వీపీఎన్ ఎంచుకునేటప్పుడు ఫ్రీ టూల్స్ కాకుండా పెయిడ్ వెర్షన్లను వాడడం బెటర్. ఫ్రీ వెర్షన్లలో యాడ్స్, మాల్వేర్స్ లాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే ఫ్రీ వీపీఎన్‌లు ఎక్కువ డేటాను తీసుకుంటూ, ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిస్తాయి. కాబట్టి ఫ్రీ వీపీఎన్ జోలికి వెళ్లొద్దు.
ఆన్ లైన్ బ్యాంకింగ్
ఇంటర్నెట్‌లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేటప్పుడు.. అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు, ఏదైనా సైట్‌లో పర్సనల్ డేటా ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు వీపీఎన్ వాడడం బెటర్. దీని వల్ల మీ ఐపీ అడ్రెస్ సేఫ్ గా ఉంటుంది. సైబర్ మోసాల ప్రమాదం తగ్గుతుంది.
పబ్లిక్ వైఫై
పబ్లిక్ వైఫై వాడేటప్పుడు ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది. అలాంటప్పుడు వీపీఎన్ వాడితే డేటా సేఫ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే రిమోట్ వర్కింగ్ చేసేవాళ్లు, డిజిటల్ నోమాడ్లు.. రకరకాల ప్లేసుల్లో ఉంటూ వర్క్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్లకు వీపీఎన్ ఎంతో యూజ్ ఫుల్.
సొంత డివైజ్‌లు కాకుండా ఇతర డివైజ్‌ల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు వీపీఎన్ వాడితే సేఫ్టీ ఇష్యూ ఉండదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ముఖ్యమైన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు సైబర్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు కూడా వీపీఎన్ పనికొస్తుంది.
ఇలా చేయొద్దు
ప్లే్స్టోర్ లో పదుల కొద్దీ వీపీఎన్ బ్రౌజర్లు, యాప్స్ కనిపిస్తాయి. వాటి జోలికి వెళ్తే.. డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ట్రస్టెడ్ వీపీఎన్ నే వాడాలి. లేదా కొన్ని ట్రస్టెడ్ బ్రౌజర్స్ లో బిల్ట్ ఇన్ గా వచ్చే వీపీఎన్ సర్వీసులను కూడా వాడుకోవచ్చు.
దేశంలో అందుబాటులో లేని కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు కూడా చాలామంది వీపీఎన్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల ఆయా వీపీఎన్ సర్వీసులను ప్రభుత్వం బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కొన్ని రూల్స్ పెట్టింది. కాబట్టి వీపీఎన్‌ను ప్రైవసీ సేఫ్టీ కోసమే వాడితే మంచిది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




