AC Safety: మీరు చేసే ఈ తప్పులే.. ఏసీలు పేలేందుకు ప్రధాన కారణం.. అవేంటంటే?
ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్లకు సంబంధించిన వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా నాలుగు నుండి ఐదు ఏసీ పేలుడు సంఘటనలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మీ ఏసీ సురక్షితంగా, సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన కారణాలు, నివారణ చర్యలు, సరైన నిర్వహణ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా కీలకం. కాబట్టి ఏసీలు ఎందుకు పేలుతాయి, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఒక ఏసీ సాధారణంగా రెండు ప్రధాన యూనిట్లను కలిగి ఉంటుంది. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్ గదిలోకి చల్లని గాలిని విడుదల చేస్తుంది, అవుట్‌డోర్ యూనిట్ గదిలోని వేడిని బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియలో ఏసీలో ఉండే రిఫ్రిజెరాంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక మూసి ఉన్న వ్యవస్థలో తిరుగుతూ, వేడిని గ్రహించి చల్లదనాన్ని అందిస్తుంది. అవుట్‌డోర్ యూనిట్‌లోని కంప్రెసర్ రిఫ్రిజెరాంట్‌ను ప్రెజరైజ్ చేస్తుంది, తద్వారా అది చల్లబడి ఇండోర్ యూనిట్‌కు చేరుకుంటుంది. ఈ నిరంతర సర్క్యులేషన్ ద్వారా గది చల్లగా ఉంటుంది. అవుట్‌డోర్ యూనిట్ హాట్ ఎయిర్‌ను బయటకు నెట్టివేస్తుంది, అందుకే దాని చుట్టూ సరైన గాలి ప్రసరణ అవసరం.
ఏసీలు ఎందుకు పేలుతాయి
షార్ట్ సర్క్యూట్ ఇది ఏసీ పేలుళ్లకు ప్రధాన కారణాలలో ఒకటి. అలాగే తక్కువ సామర్థ్యం గల ఏసీ వాడకం, గది పరిమాణానికి సరిపడని తక్కువ టన్నుల ఏసీని వాడటం వల్ల కంప్రెసర్, PCB అధిక ఒత్తిడికి లోనవుతాయి. ఏసీ గదిని నిర్దిష్ట ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి నిరంతరం పనిచేయాల్సి వస్తుంది, దీని వల్ల ఓవర్‌హీటింగ్ అయి షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని సార్లు ఏసీలు పేలుతాయి. అలానే కరెంట్‌లో హెచ్చుతగ్గులు కూడా పేళుల్లకు కారణం కావచ్చు. వోల్టేజ్‌లో ఆకస్మిక మార్పులు లేదా సర్జ్‌లు ఏసీలోని ఎలక్ట్రానిక్ భాగాలను దెబ్బతీస్తాయి, షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతాయి. స్టెబిలైజర్ లేకపోవడం లేదా తప్పు స్టెబిలైజర్ వాడకం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి
ఏసీ పేలుళ్లను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సరైన ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోండి: మీ గది పరిమాణానికి సరిపడే టన్నుల సామర్థ్యం గల ఏసీని మాత్రమే కొనుగోలు చేయండి. తక్కువ సామర్థ్యం గల ఏసీని పెద్ద గదిలో వాడటం మానుకోండి.
వోల్టేజ్ స్టెబిలైజర్ వాడకం: విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి ఏసీని రక్షించడానికి సరైన వోల్టేజ్ రేంజ్ గల స్టెబిలైజర్‌ను తప్పకుండా ఉపయోగించండి.
MCB : ఏసీకి 2-పోల్ MCBని తప్పనిసరిగా అమర్చండి. ఇది న్యూట్రల్, ఫేజ్ రెండింటినీ రక్షిస్తుంది, షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తుంది. MCBని ఏసీకి కొంత దూరంలో అమర్చాలి.
సరైన వైరింగ్: ఏసీకి కనీసం 16 ఆంపియర్స్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వైరింగ్ ఉండాలి. పాత ఇళ్లలో ఉన్న వైరింగ్ తగినంత నాణ్యత లేకపోతే, మీటర్ నుండి నేరుగా కొత్త వైరింగ్‌ను, MCBతో సహా, వేయించుకోవాలి. కేవలం 16 ఆంపియర్స్ ప్లగ్ మార్చడం ద్వారా సమస్య పరిష్కారం కాదు.
అవుట్‌డోర్ యూనిట్ ప్లేస్‌మెంట్: అవుట్‌డోర్ యూనిట్‌ను గోడలకు దగ్గరగా కాకుండా, కనీసం 2-3 అడుగుల దూరం ఉండేలా అమర్చండి. చుట్టూ మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోండి. నేరుగా సూర్యరశ్మి పడని, నీడ ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే ఏసీ సామర్థ్యం మెరుగుపడుతుంది.
పాత, సెకండ్ హ్యాండ్ ఏసీల పట్ల జాగ్రత్త: ఎవరైనా వాడిన ఏసీని కొనుగోలు చేస్తే, దానిని ఇన్‌స్టాల్ చేసే ముందు మంచి టెక్నీషియన్‌తో పూర్తిగా తనిఖీ చేయించండి. కాపర్ పైపులు, గ్యాస్ లీకేజీలు, ఇతర భాగాల స్థితిని జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైతే పాత కాపర్ పైపుల స్థానంలో కొత్తవి వాడండి.
సర్వీసింగ్: ఏడాదిలో కనీసం రెండుసార్లు ఏసీని సర్వీస్ సెంటర్ ద్వారా సర్వీసింగ్ చేయించండి. ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల కంప్రెసర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కూలింగ్ మెరుగుపడుతుంది. సరైన సర్వీసింగ్ చేయిస్తేనే వారంటీ కూడా వర్తిస్తుంది.
టెంపరేచర్ సెట్టింగ్: ఏసీని ఎల్లప్పుడూ 24°C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. 24°C కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయడం వల్ల కంప్రెసర్‌పై అధిక భారం పడి, విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతాయి.
ఏసీల వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, వినియోగదారులు పైన పేర్కొన్న జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీ జీవితాన్ని, మీ ఉపకరణాలను సురక్షితంగా ఉంచుతాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
