IPL 2026: 220 కాదు.. 260కే సేఫ్టీ లేదు భయ్యో.. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు!
ఇండియన్ ప్రిమియర్ లీగ్ అంటేనే పరుగుల విందు. కానీ ఈ 2026 సీజన్ చూస్తుంటే బౌలర్లకు గడ్డుకాలం నడుస్తోందనిపిస్తుంది. ఒకప్పుడు 160 పరుగులు కొడితే గెలుపు ఖాయమనుకునే వారు. కానీ ఇప్పుడు 260 పరుగులు చేసినా ప్రత్యర్థి జట్టు ఊపిరి బిగబట్టి ఆడుతోంది. అసలు ఈ పరుగుల వరద వెనుక ఉన్న మతలబు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ ప్రారంభ దశలో 140 నుంచి 150 పరుగులు అంటే అది ఒక గౌరవప్రదమైన స్కోరుగా భావించేవారు. అప్పట్లో 200 దాటితే అదొక అసాధ్యమైన లక్ష్యమని విశ్లేషకులు చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 220 పరుగులు బోర్డుపై ఉన్నా సరే, ఫీల్డింగ్ చేస్తున్న జట్టులో ఏమాత్రం ధీమా కనిపించడం లేదు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించిందంటే, బ్యాటర్ల వీరవిహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
200 ప్లస్ స్కోర్ల ప్రవాహం..
గణాంకాలను పరిశీలిస్తే, 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో కేవలం 11 సార్లు మాత్రమే రెండొందల మార్కును జట్లు దాటాయి. ఆశ్చర్యకరంగా 2009 సీజన్‌లో అది కేవలం ఒకే ఒక్కసారికి పరిమితమైంది. అయితే, 2008 నుంచి 2022 వరకు సుమారు 133 సార్లు ఈ ఫీట్ నమోదవ్వగా, గత నాలుగు సీజన్ల నుంచి ఈ వేగం ఊహాతీతంగా పెరిగింది. 2023 నుంచి ఇప్పటివరకు ఏకంగా 160 సార్లు జట్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్‌లోనే అత్యధికంగా 52 సార్లు ఈ మార్కు దాటగా, ప్రస్తుత 2026 ఎడిషన్‌లో సగం మ్యాచులు ముగిసేసరికే 30 సార్లు ఈ మైలురాయిని జట్లు చేరుకున్నాయి.
టాప్ ఆర్డర్ విధ్వంసం.. రికార్డుల వేట
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూరుపై చేసిన 287 పరుగులు ఇప్పటికీ లీగ్ చరిత్రలో అత్యున్నత శిఖరంగా ఉంది. నేటి తరం బ్యాటర్లు ముఖ్యంగా ఓపెనర్లు క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బౌండరీల వేట మొదలుపెడుతున్నారు. పవర్ ప్లే ఓవర్లలోనే దాదాపు 10 పరుగుల సగటుతో స్కోరు సాధిస్తుండటంతో, స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
బౌలర్ల దుస్థితి.. పిచ్‌ల తీరు
పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, బౌండరీల దూరం తగ్గడం, కుర్రాళ్లలో పెరుగుతున్న దూకుడు బౌలర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. స్పిన్నర్లు సైతం ఈ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేక తేలిపోతున్నారు. సగటున ప్రతి ఓవర్‌కు 9.68 పరుగులు నమోదవుతున్నాయంటే బ్యాటర్ల ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులకు ఇది వినోదాన్ని పంచినప్పటికీ, క్రికెట్‌లో బ్యాట్ మరియు బంతి మధ్య ఉండాల్సిన సమతూకం దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
