AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి ప్రకోపం..అకాల వర్షం బీభత్సం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి! ఎక్కడో కాదు..

ఒకవైపు భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు అకాల వర్షం ఊరటనిస్తుందని భావిస్తే, అది కాస్తా మృత్యుపాశమై మారింది. మార్కాపురం జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, పిడుగులు ముగ్గురి ప్రాణాలను బలితీసుకోగా, అన్నదాతకు అపార పంట నష్టాన్ని మిగిల్చింది. మార్కాపురం జిల్లాలో అకాల వర్షం సృష్టించిన బీభత్సం, పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి చెందిన విషాదకర ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రకృతి ప్రకోపం..అకాల వర్షం బీభత్సం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి! ఎక్కడో కాదు..
Tragedy Strikes Markapuram
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 9:21 PM

Share

మార్కాపురం జిల్లాలో కాలంకాని కాలంలో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలో కురిసింది కొద్దిసేపే అయినా, వడగండ్లు, ఈదురుగాలుల ధాటికి జనజీవనం స్తంభించింది. బేస్తవారిపేట మండలం గంటాపురంలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీ గంట శోభరాణి (40) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మార్కాపురం మండలం బోడపాడులో ఒంటేరు పుల్లమ్మ (47) పిడుగుపాటుకు బలవ్వగా, అదే గ్రామంలో కోళ్ల ఫారం వద్ద ఉన్న చింతకుంట్ల కుమారి (50) పిడుగు పడి షెడ్డు పైనుంచి ఎగిరిపడటంతో మృతి చెందింది. ఈ సంఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి, ఉప్పలపాడు, ముండ్లపాడు తదితర గ్రామాల్లో సుమారు 130 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. ఎకరాకు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు, పంట కోత దశలో ఉండగా నేలమట్టం కావడంతో లబోదిబోమంటున్నారు. మార్కాపురం, దోర్నాల, కంభం, పామూరు మండలాల్లో బొప్పాయి తోటలు నేలకూలాయి. కల్లాల్లో ఆరబోసిన మిరప పంట తడిచిపోవడంతో నాణ్యత దెబ్బతిని అమ్ముకోలేని స్థితికి చేరింది.

గత నాలుగేళ్లుగా మాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిసారి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నా ఫలితం ఉండటం లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం వివరాలను సేకరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి, ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షం మిగిల్చిన ఈ కష్టం నుంచి గట్టెక్కే మార్గం చూపాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us