మేక్ ఇన్ ఇండియా బైక్.. హోండా లవర్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కంపెనీ
భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హోండా కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా Honda CB500 బైక్ ఇంజిన్‌ను భారత్‌లోనే తయారు చేయాలని యోచిస్తోంది. దేశీయంగా తయారైన బైక్‌లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. 2027లో మరిన్ని కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

హోండా స్థానిక తయారీని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ భారత ఉత్పత్తులకు అవకాశాలు కల్పించాలని చూస్తోంది. మరోవైపు, 2028 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 80 లక్షల ద్విచక్ర వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్‌లో 501cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 28hp పవర్, 43.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ.2.75 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్ వేరియంట్ ధర రూ.3.02 లక్షల వరకు ఉంది.
భారత్‌లో CB500 ఇంజిన్ తయారీ..
హోండా ఇప్పటికే CB350 శ్రేణికి సంబంధించిన ఇంజిన్లను భారత్‌లో తయారు చేస్తోంది. ఇదే విధంగా CB500 ఇంజిన్ తయారీని కూడా స్థానికంగా చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే దేశీయ తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు ఏర్పడవచ్చు.
భారత్‌లో తయారైన CB500 బైక్‌లను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై కంపెనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హోండా CB350 ఆధారిత మోడల్‌ను GB350 పేరుతో జపాన్, యూకే వంటి మార్కెట్లలో విక్రయిస్తోంది. అయితే CB500 ఎగుమతులపై స్పష్టత రావాల్సి ఉంది.
2027లో కొత్త బైక్‌లు..
భారత మార్కెట్‌లో 2027లో మరిన్ని మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు హోండా తెలిపింది. అయితే ఏ మోడళ్లను తీసుకొస్తుంది, ఎన్ని బైక్‌లను విడుదల చేస్తుందనే వివరాలను వెల్లడించలేదు. NX500 వంటి ఇతర మోడళ్ల స్థానిక తయారీపై కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 62.5 లక్షల ద్విచక్ర వాహనాలు కాగా, 2028 నాటికి దీనిని 80 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రస్తుత తయారీ కేంద్రాల్లో అదనపు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
