Google Alert: గూగుల్ అలర్ట్.. ప్రమాదంలో 250 కోట్ల జీమెయిల్ అకౌంట్స్.. వెంటనే ఇలా చేయకపోతే..
పెరుగుతున్న హ్యాకింగ్ ముప్పు గురించి గూగుల్ తన 250కోట్ల జీమెయిల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. షైనీహంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ చేసిన దాడుల దృష్ట్యా.. వినియోగదారులు వెంటనే వారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించింది. ఈ గ్రూప్ ఫిషింగ్ ద్వారా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది.

సైబర్ దాడులు రోజురోజుకీ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది పర్సనల్ డేటా చోరీ అవడంతో పాటు వేల కోట్లను కేటుగాళ్లు కాజేశారు. అయితే ఈ దాడుల వెనుక షైనీహంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఉన్నట్లు గూగుల్ అనుమానిస్తోంది. ఈ గ్రూప్ పోకీమాన్ ఫ్రాంచైజీ నుండి ప్రేరణ పొందిందని SILIVE.com తెలిపింది. 2020 నుంచి ఈ గ్రూప్ చాలా చురుగ్గా ఉన్నట్లు సమాచారం.
అనేక పెద్ద కంపెనీలపై దాడులు
మైక్రోసాఫ్ట్, ఏటీఅండ్‌టీ, శాంటాండర్, టికెట్‌మాస్టర్ వంటి అనేక పెద్ద కంపెనీల డేటా ఉల్లంఘనల వెనుక ఈ గ్రూప్ ఉందని SILIVE.com నివేదించింది. ఫిషింగ్ అనేది ఈ గ్రూప్ ఇష్టమైన పద్ధతి. ఈ హ్యాకర్లు ఈమెయిల్స్ పంపుతారు. ఈ ఈమెయిల్స్‌లో నకిలీ లాగిన్ పేజీల లింకులు ఉంటాయి. యూజర్లు ఆ లింకులను క్లిక్ చేయగానే వారి లాగిన్ సమాచారం, ఇతర సున్నితమైన వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. ఈ గ్రూప్ ఇప్పటివరకు దొంగిలించిన డేటాలో చాలా వరకు బహిరంగంగా అందుబాటులో ఉంది. అయితే ఈ గ్రూప్ మరిన్ని దాడులకు పాల్పడవచ్చని గూగుల్ హెచ్చరిస్తోంది.
టూ-స్టెప్ వెరిఫికేషన్
గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో.. షైనీహంటర్స్ తమ దోపిడీ వ్యూహాన్ని తీవ్రతరం చేయడానికి ఒక కొత్త బ్రాండ్ డేటా లీక్ సైట్ (DLS)ను ప్రారంభించవచ్చని తెలిపింది. ఆగస్టు 8న గూగుల్ ప్రభావితమైన జీమెయిల్ యూజర్లకు ఒక ఈమెయిల్ పంపి, తమ ఖాతాల భద్రతను వెంటనే పెంచుకోవాలని సూచించింది. టూ-స్టెప్ వెరిఫికేషన్ అనేది మీ ఖాతాకు అదనపు భద్రతను ఇస్తుంది. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసినా, టూ-స్టెప్ వెరిఫికేషన్ ఉంటే వారు మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు. ఈ ఫీచర్ ఆన్ చేస్తే, పాస్‌వర్డ్‌తో పాటు రెండవ కోడ్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయితే..
ఈ హెచ్చరిక కేవలం ప్రభావితమైన వినియోగదారులకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది. బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా లాగిన్‌ల కోసం చాలా మంది ఈమెయిల్ ఖాతాలనే ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఒక జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయితే అది అనేక ఇతర పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. మీరు ఇప్పటికీ మీ జీమెయిల్ ఖాతాకు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయకుంటే, వెంటనే దాన్ని ఆన్ చేసుకోండి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




