Google: ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ యాప్స్ ఇన్‌స్టాల్ చేయలేరు.. ఎందుకంటే..?
2026 నుండి ఆండ్రాయిడ్ పరికరాల్లో అన్ ఆథరైజ్‌డ్ డెవలపర్‌ల యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నిషేధించబోతోంది. ఇప్పుడు ధృవీకరించబడిన డెవలపర్‌ల యాప్‌లు మాత్రమే పనిచేస్తాయి. కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, డెవలపర్‌లు ధృవీకరణ ఎలా చేసుకోవాలి..? దాని ప్రభావం Android యూజర్లపై ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ బయట నుంచి కూడా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉండేది. ఈ విధానాన్ని సైడ్‌లోడింగ్ అంటారు. అయితే భవిష్యత్తులో ఈ స్వేచ్ఛ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. గూగుల్ త్వరలో దీనిపై కొత్త నియమాలను అమలు చేయనుంది.
కొత్త నియమం ఏమిటీ?
గూగుల్ తీసుకురానున్న కొత్త విధానం ప్రకారం.. ఇకపై కేవలం ధృవీకరించబడిన డెవలపర్లు తయారు చేసిన యాప్‌లను మాత్రమే ఏదైనా ఆండ్రాయిడ్ పరికరంలో ఇన్‌స్టాల్ చేయగలరు. ఇప్పటివరకు ప్లే స్టోర్‌లో యాప్‌లను ఉంచే డెవలపర్‌లకు మాత్రమే ధృవీకరణ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు థర్డ్-పార్టీ యాప్‌లను తయారు చేసే డెవలపర్లు కూడా గూగుల్ ద్వారా ధృవీకరించబడాలి. ఇందుకోసం గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ కన్సోల్ అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురానుంది. ఇందులో డెవలపర్లు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
కొత్త నియమం ఎప్పుడు అమలులోకి వస్తుంది?
అక్టోబర్ 2025: గూగుల్ ఈ కొత్త వ్యవస్థను పరీక్షించడం ప్రారంభిస్తుంది.
మార్చి 2026: అన్ని డెవలపర్‌లకు కొత్త ఆండ్రాయిడ్ డెవలపర్ కన్సోల్ అందుబాటులోకి వస్తుంది.
సెప్టెంబర్ 2026: ఈ నియమం మొదటగా బ్రెజిల్, ఇండోనేషియా, సింగపూర్ మరియు థాయిలాండ్‌లలో అమలు చేయబడుతుంది.
2027 నాటికి: ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని గూగుల్ యోచిస్తోంది.
ఈ మార్పు ఎందుకు..?
సైడ్‌లోడెడ్ యాప్‌ల వల్ల మాల్వేర్ ప్రమాదం 50 రెట్లు ఎక్కువని గూగుల్ పేర్కొంది. చాలా సందర్భాలలో హ్యాకర్లు, మోసపూరిత యాప్ డెవలపర్లు నిషేధానికి గురైన తర్వాత కొత్త పేరుతో తిరిగి వస్తుంటారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ నిజమైన డెవలపర్‌లను గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే నకిలీ డెవలపర్‌లను పట్టుకోవడం సులభం అవుతుంది. 2023లో ప్లే స్టోర్‌లో వెరిఫికేషన్ అమలు చేసిన తర్వాత, మాల్వేర్, మోసం, డేటా దొంగతనం కేసులు గణనీయంగా తగ్గాయని గూగుల్ తెలిపింది.
వినియోగదారులపై ప్రభావం.. ?
ఈ కొత్త నియమం అమలులోకి వచ్చిన తర్వాత మీరు గూగుల్ ధృవీకరించిన డెవలపర్‌ల నుంచి వచ్చిన యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోగలరు. ధృవీకరించబడని డెవలపర్ నుంచి వచ్చిన యాప్‌లను ఇకపై ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. అయితే ఈ నియమం కస్టమ్ ROMలు లేదా గూగుల్ సేవలు లేని చైనా వంటి దేశాలలోని కొన్ని పరికరాలకు వర్తించదు. ఈ మార్పు ఎపిక్ గేమ్స్‌తో జరిగిన న్యాయపోరాటానికి సంబంధించినది. కోర్టు తీర్పు తర్వాత, గూగుల్ యాప్స్ మరింత నియంత్రణ సాధించడానికి ఈ కొత్త నియమాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




