వాహనదారులకు శుభవార్త.. ఖరీదైన పెట్రోల్, డీజిల్ నుంచి విముక్తి.. ఎలాగంటే..?
Flex Fuel Engine: దేశంలో ఖరీదైన పెట్రోల్, డీజిల్‌కు బదులు చౌక ఇంధనంతో నడిచే వాహనాలు త్వరలో ప్రారంభంకాబోతున్నాయి.
Flex Fuel Engine: దేశంలో ఖరీదైన పెట్రోల్, డీజిల్‌కు బదులు చౌక ఇంధనంతో నడిచే వాహనాలు త్వరలో ప్రారంభంకాబోతున్నాయి. అవును ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌లతో కూడిన వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆటోమొబైల్ కంపెనీలను కోరింది. కంపెనీలు రాబోయే ఆరు నెలల్లో BS-VI (భారత్ స్టేజ్ 6) ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్, ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తిని ప్రారంభించాలి. ఫ్లెక్స్ ఇంధనం సహాయంతో ప్రభుత్వం రెండు లక్ష్యాలను చేధించాలనుకుంటోంది. ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు వాహనాల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ వాయువులను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.
ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే కారు పెట్రోల్-డీజిల్ కంటే 35 నుంచి 40 శాతం చౌకగా ఉంటుంది. అంతే కాదు ఇది పర్యావరణ అనుకూలమైనది. ఎటువంటి హాని ఉండదు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను గట్టిగా సమర్థిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ధర లీటరుకు రూ.60 నుంచి 62 వరకు ఉంటుంది. ఇది పెట్రోల్ లేదా డీజిల్ కంటే తక్కువగా ఉంటుందని దీని వల్ల కారు డ్రైవింగ్ 40 శాతం వరకు చౌకగా మారుతుందని అంటున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు ఒకటి కంటే ఎక్కువ ఇంధనంతో పని చేయగలవు.
ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్‌లు పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమంపై పని చేస్తాయి. ఇథనాల్ లేదా మిథనాల్ వ్యవసాయ పంటలు వాటి అవశేషాల నుంచి లభిస్తుంది. కాబట్టి అవి సులభంగా తక్కువ ఖర్చుతో లభిస్తాయి. బ్రెజిల్, కెనడా, అమెరికాలోని ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ దేశాలలో వినియోగదారులు 100% పెట్రోల్ లేదా 100% బయో-ఇథనాల్ ఎంపికను పొందుతారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లతో కూడిన వాహనాలు భారతదేశంలో కూడా అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా కారు ధర తగ్గుతుంది. కొంతవరకు కాలుష్య సమస్య నుంచి కూడా బయటపడుతుంది.