Automobile: మళ్ళీ పెరుగుదల రూటులో వాహనాల ధరలు..జూలై నుంచి ధరల మోత..ఆ మూడు కారణాలతోనే!

Automobile: ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుండి సామాన్యులను చుట్టుముట్టింది. ఆహార పదార్ధాలు.. పెట్రోల్.. ఇలా ఎక్కడా వదిలిపెట్టకుండా భారం పడిపోతోంది.

  • Publish Date - 8:50 pm, Thu, 24 June 21
Automobile: మళ్ళీ పెరుగుదల రూటులో వాహనాల ధరలు..జూలై నుంచి ధరల మోత..ఆ మూడు కారణాలతోనే!
Automobile

Automobile: ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుండి సామాన్యులను చుట్టుముట్టింది. ఆహార పదార్ధాలు.. పెట్రోల్.. ఇలా ఎక్కడా వదిలిపెట్టకుండా భారం పడిపోతోంది. ఇవే కాదు.. ఇప్పటికే సంవత్సరంలో రెండుసార్లు పెరిగిన వాహనాల ధరలు మరోసారి పెరుగుదల బాటలో పరుగులు తీస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చాలా వాహనాల కంపెనీలు తమ వాహన శ్రేణి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. అంటే ఇకపై కారు కొనడం మరింత ఖరీదైనదిగా మరిపోనుంది. కరోనా పరిస్థితుల్లో కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ధరాఘాతం గట్టిగానే తగలనుంది. కార్ల తో పాటు బైక్ ల ధరలూ పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే హీరో కంపెనీ తన మోటార్ సైకిళ్ళ ధరలను ఒకటో తేదీనుంచి పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా కాలంలో వాహనాల విక్రయాలు కాస్త తగ్గినా.. అంటే డిమాండ్ అంతగా లేకపోయినా వాహనాల ధరలు పెరగడానికి కారణాలు ఏమిటి? ఆటో పరిశ్రమ నిపుణులు మూడు కారణాలు ధరల పెరుగుదల కోసం చెబుతున్నారు. అవి ఏమిటంటే..

1. పెరిగిన ఉక్కు ధరలు: వాహనాల ధరల పెరుగుదలకు సంబంధించి, ముడి పదార్థాల ధరల పెరుగుదల ఒక కారణం. దీని కారణంగా వాహనాన్ని తయారుచేసే ఖర్చు కూడా పెరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉక్కు ధరలు చాలా వేగంగా పెరిగాయి. ఎంతలా అంటే.. గత ఏడాదిలో స్టీల్ ధరలు 50 శాతం పెరిగాయి.

2. సెమీకండక్టర్ కొరత: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల సరఫరా, డిమాండ్ మధ్య విస్తృత అంతరం ఉంది. చెడు వాతావరణం, కరోనా మహమ్మారి కారణంగా చాలా సెమీ కండక్టర్ కంపెనీలు తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. దీంతో వీటి కొరత ఏర్పడింది. అందువల్ల ఈ సెమీ కండక్టర్లను కార్ల కంపెనీలు ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది.

3. రవాణా భారం: బయటి నుండి వచ్చే వాహనాలపై పన్ను ఎక్కువ అవడంతో పాటు, వాటి రవాణా ఖర్చూ అధికమవుతోంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇది వాహన తయారీ కంపెనీలపై భారాన్ని మోపుతోంది.

ఈ విషయాలన్నీ ప్రస్తుతం వాహనాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణాలతోనే వాహన ఉత్పత్తిదారులు అందరూ తమ వాహనాల ధరలను పెంచేందుకు చూస్తున్నారు.

ఈ కోవలో జనవరి 18 న మారుతి సుజుకి ఇండియా తన కార్ల ధరను రూ .34 వేల వరకు పెంచింది. ఆ సమయంలో దాదాపు అన్ని కంపెనీలు వాటి ధరలను పెంచాయి. అప్పుడు కూడా ముడి పదార్థాల ధరలను పెంచడం గురించి కంపెనీలు చెప్పాయి. దీని తరువాత, మారుతి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ 16 నుండి రూ .22,500 వరకు పెంచింది. కొత్త ధరల తరువాత, ఆల్టో రూ .12,500 పెరిగింది. అదే సమయంలో ఆర్టిగా ధరను రూ .22,500 పెంచారు. కంపెనీ మినీ ఎస్‌యూవీ అని పిలువబడే ఎస్-ప్రెస్సో కారు కూడా 7,500 రూపాయల వరకు ధర పెరిగింది.

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ కూడా ధరలను పెంచాలని నిర్ణయించింది. హీరో వాహనాల ధరలు జూలై నుండి రూ .3000 వరకు పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. అంతకుముందు, ఏప్రిల్‌లో కూడా కంపెనీ ధరలను పెంచింది. అదే విధంగా ద్విచక్ర వాహనాలను బిఎస్ 6 ఇంజిన్‌ కు అప్ గ్రేడ్ చేసినప్పుడు కూడా ధరలను పెంచారు.

అన్ని కంపెనీలకు వాహన తయారీ ఖర్చు పెరిగింది. మారుతి, హీరోలకు సంబంధించి ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, మిగిలిన కంపెనీలు ఇంకా తమ నిర్ణయం చెప్పలేదు. కానీ, రెనాల్ట్ కార్లు 39,030 రూపాయల వరకు పెరగనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇతర కంపెనీలు కూడా ధరల పెరుగుదలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో, జూలై నుండి, చాలా కంపెనీల వాహనాలు ఖరీదైనవి అవుతాయి. ఇంతకుముందు, మారుతితో పాటు ఏప్రిల్‌లో కారు ధరలను పెంచినప్పుడు, నిస్సాన్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Also Read: Seaplane: బైక్ ఇంజన్ తో ‘సీప్లేన్’ తయారు చేసిన అస్సాం వాసి… కల నెరవేరిందని హ్యాపీ !

Lava Benco 80: బెంకోతో చేతులు క‌లిపిన లావా.. వి80 పేరుతో కొత్త ఫోన్ లాంచ్.. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్లు.