Truecaller:’యూజర్ల డేటాను ఇతర సంస్థలతో పంచుకుంటోన్న ట్రూకాలర్’.. నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు
Truecaller: ట్రూ కాలర్ మొబైల్ తమ యూజర్ల అనుమతి లేకుండానే ఇతర సంస్థలతో డేటాను పంచుకుంటుందంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు..
Truecaller: ట్రూ కాలర్ మొబైల్ తమ యూజర్ల అనుమతి లేకుండానే ఇతర సంస్థలతో డేటాను పంచుకుంటుందంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని.. ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ ఎస్ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్‌లతో పాటు లోన్‌లు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు.
ట్రూకాలర్ వాదన ఇలా ఉంది..
ఇదిలా ఉంటే తమ సంస్థపై దాఖలైన వ్యాజ్యంపై ట్రూకాలర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ట్రూకాలర్ యూజర్ల డేటాను ఇతర కంపెనీలకు షేర్ చేస్తుందన్న వాదనను ఖండించింది. గతేడాదే ట్రూకాలర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) చెల్లింపు సేవలను నిలిపివేసిందని సంస్థ తెలిపింది. ట్రూకాలర్ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తోందని, ప్రపంచంలో ఎక్కడైనా డేటా రక్షణ చట్టాలకు లోబడి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ట్రూకాలర్ కేవలం తమ సేవలను అందించడానికి అవసరమైన డేటాను మాత్రమే తీసుకుంటుందని కంపెనీ తెలిపింది. ట్రూకాలర్ యూజర్ డేటాను మరే కంపెనీతో పంచుకోదని, వినియోగదారుల డేటా పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇక తమ యూజర్ల డేటాను భారత్‌లోనే స్టోర్ చేస్తుందని, దీనికి అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని స్పష్టతనిచ్చింది. మరి ట్రూకాలర్ విదాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read: Viral Video: జురాసిక్ పార్క్‌లోని చిన్నసైజ్ డైనోసార్లను తలపించిన ఉడుములు.. వైరల్ గా మారిన వీడియో
Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు