Asia Cup 2023: ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణపై ఉత్కంఠ.. జైషా వ్యాఖ్యలకు పీసీబీ ప్రెసిడెంట్‌ కౌంటర్..

వచ్చే ఏడాది జరిగే పాక్‌లో జరిగే ఆసియాకప్‌ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. టోర్నీని పాక్‌లోనే నిర్వహిస్తామని పీసీబీ ప్రెసిడెంట్‌ చెబుతుంటే.. పాక్‌లో అడుగుపెట్టేదే లేదంటున్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా.

Asia Cup 2023: ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణపై ఉత్కంఠ.. జైషా వ్యాఖ్యలకు పీసీబీ ప్రెసిడెంట్‌ కౌంటర్..
Jay Shah Ramiz Raja
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 03, 2022 | 8:35 PM

వచ్చే ఏడాది జరిగే పాక్‌లో జరిగే ఆసియాకప్‌ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. టోర్నీని పాక్‌లోనే నిర్వహిస్తామని పీసీబీ ప్రెసిడెంట్‌ చెబుతుంటే.. పాక్‌లో అడుగుపెట్టేదే లేదంటున్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. అవసరమైతే తటస్థ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో.. పరిస్థితి టోర్నీపై అనుమానాలు కలుగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం వన్డే ఫార్మాట్‌లో జరగాల్సిన ఆసియాకప్‌ 2023కు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కేంద్రం అనుమతిస్తే ఈ టోర్నీలో టీమిండియా ఆడుతుందని ప్రకటించారు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ. ఆయన ప్రకటనకు విరుద్ధంగా పాక్‌లో టీమిండియా ఆడే ప్రసక్తే లేదంటున్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. అవసరమైతే తటస్థ వేదికగా ఆసియాకప్‌ను తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా టీమిండియా.. పాక్‌లో అడుగుపెట్టలేదన్న సంగతి గుర్తుచేశారు. శత్రుదేశంలో ఆడబోమని తేల్చిచెప్పారు.

ఆసియాకప్‌లో టీమిండియా జట్టు పాల్గొనడంపై జైషా వ్యాఖ్యలకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రెసిడెంట్‌ రమీజ్‌ రాజా కౌంటరిచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా టోర్నీ నిర్వహణకు హక్కులు పొందామన్న రమీజ్‌ రాజా.. టోర్నీలో ఆడడం, ఆడకపోవడం భారత్‌ ఇష్టమన్నారు. టీమిండియా ఆడినా.. ఆడకపోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఒకవేళ ఆసియా కప్‌ పాక్‌లో కాకుండా మరే ఇతరదేశంలో నిర్వహించినా పాకిస్థాన్‌ ఆడబోదని తేల్చిచెప్పారు.

పాకిస్థాన్‌లో పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు రమీజ్‌రాజా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు కూడా పర్యటించి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. భారత్, పాక్‌ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా టోర్నీలో అడుగు పెట్టబోమనడం తగదన్నారు. టోర్నీలో ఆడడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏంటని జైషాను నిలదీశారు. తాము ఆసియా కప్‌ను వాల్డ్‌ కప్‌తో సమానంగా చూస్తామని స్పష్టం చేశారు.

రమీజ్‌రాజా హెచ్చరికలు, జైషా పంతంతో వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్‌ టోర్నీ హాట్‌టాపిక్‌గా మారింది. జైషా చెప్పినట్లు టోర్నీ తటస్థ వేదికగా జరగనుందా? లేక రమీజ్‌ రాజా చెబుతున్నట్లు పాక్‌లో జరుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఆసియాకప్‌ భారత్‌, పాక్‌ మధ్య మరో వివాదానికి కేంద్రంగా మారినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..