Watch Video: మ్యాచ్‌ జరుగుతుండగా పిడుగు పడి ఫుడ్‌బాల్‌ ప్లేయర్‌ మృతి.. భయానక వీడియో 

పుట్ బాల్ మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో ఊహించని సీన్ చోటు చేసుకుంది. ఉన్నట్లుండి ఆటగాళ్లపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఓ ఆటగాడు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఐదుగురు ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..

Watch Video: మ్యాచ్‌ జరుగుతుండగా పిడుగు పడి ఫుడ్‌బాల్‌ ప్లేయర్‌ మృతి.. భయానక వీడియో 
Peruvian Footballer Killed By Lightning Strike
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 06, 2024 | 11:18 AM

పెరూ, నవంబర్ 6: మృత్యువు ఎప్పుడు ఎటునుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అటువంటి సంఘటనే పెరూలో చోటు చేసుకుంది. స్టేడియంలో ఫుట్‌బాల్‌ ఆట ఉత్కంఠ భరితంగా సాగుతుంది. స్టేడియం చుట్టూ జనాలు హోరాహోరీగా తమ టీం గెలవాలని హోరెత్తి అరుస్తున్నారు. కానీ ఇంతలో ఊహించని సీన్‌ చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోని ఆటగాళ్లపై పిడుగు పడింది. అంతే ఆటగాళ్లలో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెరూలోని చిల్కా జిల్లాలోని పెరువియన్‌లోని హువాన్‌కాయో నగరంలో స్థానికంగా జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌ జరుగుతుండగా.. జోస్ హుగా డి లా క్రూజ్ మెజా (39) అనే ఆటగాడిపై పిడుగు పడటం వీడియో ఫుటేజీలో చూడవచ్చు. గ్రౌండ్‌లో ప్లేయర్లు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పిడుగు పడింది. ఆ సమయంలో జోస్‌ హుగా పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న గోల్ కీపర్ జువాన్ చొక్కా లక్టా (40) కూడా ఉన్నాడు. పిడుగు ధాటికి తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యాడు. మెరుపు దాడి జరిగిన కొద్దిసేపటికే సమీపంలోని ఎనిమిది మంది ఆటగాళ్లు నేలపై పడిపోవడం వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

22 నిమిషాల పాటు ఫామిలియా చొక్కాతో జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్లావిస్టా 2-0 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. అయితే స్టేడియం సమీపంలో ఉరుములతో కూడిన భారీ శబ్దాలు రావడంతో ఆటను నిలిపివేయాలని రిఫరీ నిర్ణయించారు. కానీ జోస్ హుగా చేతికి మెటల్ బ్రాస్‌లెట్‌ ఉండటంతో.. దాని కారణంగా అతనిపై పిడుగు పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన హువాన్‌కాయో నగరం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. అక్కడ వర్షాకాలంలో తరచుగా ఉరుములు, పిడుగుతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియా ఓ ఫుట్‌బాల్ ఆటగాడిపై ఇదే విధంగా పిడుగుపడటంతో మృతి చెందాడు. మృతి చెందిన ప్లేయర్‌ను జావాలోని సుబాంగ్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి సెప్టైన్ రహాజాగా గుర్తించారు. పాతికేళ్ల క్రితం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో పిడుగు పడటంతో ప్లేయర్లు, ప్రేక్షకులతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.