Virat Kohli : విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ..మ్యాచ్ చూసే వాళ్లకు పైసా వసూల్ ఖాయం
భారత్, సౌతాఫ్రికా మధ్య రేపు, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు (135, 102 పరుగులు) చేసి, 118.50 సగటుతో 237 పరుగులు చేసి, సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

Virat Kohli : భారత్, సౌతాఫ్రికా మధ్య రేపు, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు (135, 102 పరుగులు) చేసి, 118.50 సగటుతో 237 పరుగులు చేసి, సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన విరాట్, మూడో వన్డేలో మరో మూడు అతిపెద్ద రికార్డులను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ మూడు రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వన్డే సెంచరీల డబుల్ హ్యాట్రిక్
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 12 మంది క్రికెటర్లు మాత్రమే వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు (వన్డే సెంచరీల హ్యాట్రిక్) సాధించారు. ప్రపంచంలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ మాత్రమే ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. భారత్ తరఫున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఇప్పటివరకు ఒక్కోసారి మాత్రమే వన్డే సెంచరీల హ్యాట్రిక్‌ను పూర్తి చేశారు. ఒకవేళ సౌతాఫ్రికా పై జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, అతను రెండుసార్లు వన్డే సెంచరీల హ్యాట్రిక్ సాధించిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలవడంతో పాటు, అంతర్జాతీయంగా బాబర్ అజామ్ సరసన చేరుకుంటాడు.
సౌతాఫ్రికా పై నాలుగో సెంచరీ
విరాట్ కోహ్లీ ఇప్పటికే సౌతాఫ్రికా పై వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లలో సెంచరీలు (2023 వన్డే వరల్డ్ కప్,ప్రస్తుత సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు) కొట్టాడు. ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్‌లో కూడా అతను సెంచరీ చేస్తే, వన్డే క్రికెట్లో సౌతాఫ్రికా పై వరుసగా 4 ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్‌గా అరుదైన రికార్డును సృష్టిస్తాడు.
సంగక్కర రికార్డు
మరో ముఖ్యమైన రికార్డు ఏమిటంటే, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 555 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 27,910 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (28,016 పరుగులు) ను అధిగమించడానికి కోహ్లీకి కేవలం 107 పరుగులు మాత్రమే అవసరం. మూడో వన్డేలో కోహ్లీ 107 పరుగులు సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.




