IND vs SA: తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడనున్న రజత్ పాటిదార్.. ఆ ఇద్దరు ఆటగాళ్లే తనకు ఆదర్శం అంటున్న యువ క్రికెటర్..

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున ఆడిన రజిత్ పాటిదార్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు ఈ యువ క్రికెటర్.. 29 ఏళ్ల ఈ ఆటగాడికి అంతర్జాతీయ మ్యాచుల్లో..

IND vs SA: తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడనున్న రజత్ పాటిదార్.. ఆ ఇద్దరు ఆటగాళ్లే తనకు ఆదర్శం అంటున్న యువ క్రికెటర్..
Rajat Patidar, Virat Kohli
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 06, 2022 | 9:27 AM

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున ఆడిన రజత్ పాటిదార్ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు ఈ యువ క్రికెటర్.. 29 ఏళ్ల ఈ ఆటగాడికి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికి.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు పాటిదార్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో అక్టోబర్ 6వ తేదీ గురువారం లక్నో వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న మొదటి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో అరంగ్రేటం చేయనున్నాడు ఈ ఆటగాడు. అయితే తనకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదర్శమని, వారిని తాను ఆరాధిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడైన రజత్ పాటిదార్ కోహ్లీతో కలిసి ఆడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్ అని, వారిద్దరు తమ కెరీర్ లో బ్యాట్ తో ఎన్నో అద్భుతాలు చేశారన్నారు. తన లాంటి ఎంతో మంది వర్థమాన క్రికెటర్లకు వారిద్దరూ స్ఫూర్తినిచ్చారని రజత్ పాటిదార్ తెలిపాడు. దేశవాలీ క్రికెట్ లో సత్తా చాటిన రజత్ పాటిదార్ , ఐపీఎల్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు జరగనున్న వన్డే సిరీస్ కు రజత్ పాటిదార్ ను ఎంపిక చేశారు.

వాస్తవానికి అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియాకు పయనమైంది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు భారత జట్టులో చాలామంది కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. వీరిలో రజత్ పాటిదార్ కూడా ఒకరు. తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడనున్న పాటిదార్ తన ఆరాద్య క్రికెటర్ల గురించి మనసులో మాటను బయటకు చెప్పాడు. ఐసీఎల్ లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన అనుభవం ఉంది. దీనిపై పాటిదార్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం, మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఎంతో ప్రత్యేకమైనదన్నాడు. మైదానం బయట కూడా ఎప్పుడూ అడిగినా తన ఆటను మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు ఇస్తూ.. సహాయంగా ఉంటాడని తెలిపాడు. మైదానం లోపల, బయట విరాట్ కోహ్లీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాని రజత్ పాటిదార్ తన ఇంటర్వ్యూలో తెలిపాడు.

తన బ్యాటింగ్ పై కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తన బ్యాటింగ్ మెరుగుదలకు ఎప్పుటికప్పుడు టిప్స్ అందిస్తూ ఉంటాడని రజత్ పాటిదార్ తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు తాను అభిమానించే క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ అని చెప్పాడు. క్రికెటర్లు కాకుండా క్రీడారంగానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డ్ తన అభిమాన క్రీడాకారుడని పాటిదార్ తెలిపాడు. తన చిన్నతనంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తన అభిమాన క్రికెటర్లని, ప్రస్తుతం ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారన్నాడు. అన్ని ఫార్మట్లకు వారిద్దరూ సరైన ఆటగాళ్లంటూ కితాబిచ్చాడు. జట్టు కోసం నిలకడగా రాణిస్తున్నారని పాటిదార్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..