Tokyo Olympics 2021: జులై 13న అథ్లెట్లతో ప్రధాని మోడీ మీటింగ్..! టోక్యో బయలుదేరనున్న ప్లేయర్స్
ఒలింపిక్స్ కోసం భారత ఆటగాళ్లు త్వరలో టోక్యోకు బయలుదేరబోతున్నారు. జూలై 17 న మొదటి బ్యాచ్ ఆటగాళ్లు బయలుదేరుతారు.
Tokyo Olympics 2021: ఒలింపిక్స్ కోసం భారత ఆటగాళ్లు త్వరలో టోక్యోకు బయలుదేరబోతున్నారు. జూలై 17 న మొదటి బ్యాచ్ ఆటగాళ్లు బయలుదేరుతారు. జులై 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి దాదాపు 120 మంది ఆటగాళ్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ఆటగాళ్లతో జులై 13న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. అయితే, కరోనా కారణంగా వర్చువల్‌గా అథ్లెట్లతో ఆయన మాట్లాడనున్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఆటగాళ్లతో మాట్లాడారు. మన్ కి బాత్‌లో క్రీడాకారుల పోరాట గాధలను ప్రజలకు తెలియజేశారు. ‘ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా, కొన్నేళ్లుగా ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన వారందరినీ అభినందిస్తున్నాను. వారు చేసిన కృషికి, ఇతర అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నాలతో భారత్ గర్వంగా ఉంది. టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలు కొన్ని వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఒలింపిక్ లో పాల్గొనే అథ్లెట్లకు శుభాకాంక్షలు’ అంటూ ఒలింపిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
జులై 13 న ఆటగాళ్లతో.. జులై 13న ఆటగాళ్లతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఈమేరకు ‘మైగోవ్ ఇండియా’ ట్వీట్ చేసింది. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడతారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, మొదటి జట్టు ఎయిర్ ఇండియా విమానంలో టోక్యోకు బయలుదేరుతుంది. భారతదేశం నుంచి 120 మందికి పైగా ఆటగాళ్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన భారత ఒలింపిక్ అసోసియేషన్… అందరి ప్లేయర్లను అధికారికంగా ప్రకటించలేదు.
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ మేరీ కోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఇద్దరూ ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో పతాకాధారులుగా వ్యవహరించనున్నారు. అలాగే ఆగస్టు 8 న జరిగే ముగింపు కార్యక్రమంలో రెజ్లర్ బజరంగ్ పునియాకు కూడా అవకాశం దక్కింది. ఈమేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తన నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తెలియజేసింది.
Also Read: