Tokyo Olympics 2021: సోషల్ మీడియాకు దూరంగా ఉంటే.. కచ్చితంగా పతకం సాధిస్తారు: భారత హాకీ మాజీ కోచ్ హరేంద్ర సింగ్
టోక్యో ఒలింపిక్స్ 2020 పోటీలకు వెళ్లే భారత పురుషుల హాకీ జట్టు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని మాజీ కోచ్ హరేంద్ర సింగ్ సూచించారు.
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 2020 పోటీలకు వెళ్లే భారత పురుషుల హాకీ జట్టు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని మాజీ కోచ్ హరేంద్ర సింగ్ సూచించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే కల నెరవేరడానికి.. కరోనా కాలంలో చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని ఆటగాళ్లను ఆయన కోరారు. ఈయన కోచ్‌గా ఉన్న సమయంలోనే 2016 జూనియర్ ప్రపంచ కప్‌ను భారత హాకీ టీం గెలిచింది. ఆనాటి టీంలో ఆడిన వారిలో ప్రస్తుత భారత హాకీ జట్టులోని చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో కెప్టెన్ మన్‌దీప్ సింగ్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, నీల్కాంత్ శర్మ, సుమిత్ ప్రస్తుత హాకీ జట్టుతో ఉన్నారు.
కోచ్ హరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈసారి ఒలింపిక్స్‌లో కరోనా కారణంగా, పోటీలు భిన్నంగా, కష్టంగా ఉండనున్నాయి. నా సలహా ఏమిటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండి, ఆటపై దృష్టి పెట్టండి. ఒలింపిక్స్ కోసం ఎంత కష్టాన్ని పడ్డారో మర్చిపోకూడదు. కరోనా కాలంలో ఎలాంటి త్యాగాలు చేశారో గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మీ సమర్థుతను చూపించే సమయం ఆసన్నమైంది. దాని కోసం మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయని’ ఆయన పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ జులై 23 న ప్రారంభమై ఆగస్టు 8న ముగుస్తాయి. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.
ప్రేక్షకులు లేకుండా జట్లు ఆడటం అంత సులభం కాదని హరేంద్ర అభిప్రాయపడ్డారు. ‘ఖాళీ స్టేడియంలో ఆడటం అంత సులభం కాదు. కానీ, ఈ సమయంలో యువ ఆటగాళ్ళపై ఒత్తిడి చాలా ఉంటుందని, జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి. దీని నుంచి భారత జట్టుకి మంచే జరుగుతందని’ వెల్లడించారు. హరేంద్ర 2017-18 వరకు భారత పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేశారు. భారత హాకీ జట్టు మొదటి లక్ష్యం క్వార్టర్ ఫైనల్స్ కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పతకాల గురించి ఆలోచించవద్దని, మొదట క్వార్టర్ ఫైనల్స్ గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. ఈమ్యాచ్‌లు సెమీ-ఫైనల్స్ లేదా ఫైనల్స్ కంటే కూడా చాలా ముఖ్యమైనవని అన్నారు.
భారత జట్టును బలోపేతం చేయడానికి ఆటగాళ్లు, కోచ్ చేసిన కృషిని ఈ మాజీ కోచ్ ప్రశంసించాడు. ‘ఇండియన్ హాకీ సరైన దిశలో సాగుతోందని, ప్రతి కోచ్ దీనికి సహకరించారని’ ఆయన కితాబిచ్చారు. 2000 నుంచి భారత హాకీ టీం బలమైన జట్టుగా మారిందని, ఈ జట్టు టోక్యోలో పతకం సాధించగలదనే ధీమా వ్యక్తం చేశారు. మేము 40 సంవత్సరాలుగా పతకం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కుర్రాళ్లు జూనియర్ స్థాయిలో విజయం సాధించారు. అత్యున్నత స్థాయి ప్రదర్శనతో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించగలరు. జట్టులో పాత, కొత్త కలయిక బాగా సెట్ అయిందని, మొదటిసారి టీంలోని ప్రతీ ఆటగాడు ఏ స్థితిలోనైనా ఆడగలిగేలా తయారయ్యారని’ ఆయన వెల్లడించారు.
Also Read: